Andhra Pradesh: నేడు భేటీ కానున్న ఏపీ కేబినెట్.. ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లపై క్లారిటీ వచ్చే ఛాన్స్!

  • కిడారి, సోమలకు సంతాపం తెలపనున్న కేబినెట్
  • ప్రభుత్వ పథకాలపై సమీక్ష
  • భూ కేటాయింపులకు ఆమోదం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు నెలనెలా రూ.1,000 నిరుద్యోగ భృతిని అందించే ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ఇటీవల ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంపై నిరుద్యోగుల్లో గంపెడాశలు నెలకొన్నాయి.

అమరావతిలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో తొలుత మావోయిస్టులు కిరాతకంగా హత్యచేసిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలకు సంతాపం తెలపనున్నారు. ప్రభుత్వం తరఫున వారి కుటుంబాలకు ప్రకటించిన పరిహారం నిర్ణయానికి ఆమోదం తెలపనున్నారు. అనంతరం గ్రామదర్శిని, ఇతర సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరవు తరహా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అలాగే వేర్వేరు విద్యా సంస్థలు, కంపెనీలకు  చేసిన భూకేటాయింపులకు ఆమోదం తెలపనున్నారు.

తాజాగా ఎన్నికల ముందు కేబినెట్ భేటీ కానున్న నేపథ్యంలో నిరుద్యోగులు ప్రభుత్వంపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఇటీవల ఆర్థికశాఖ 182 గ్రూప్-1, 337 గ్రూప్-2 పోస్టులతో పాటు 2650 గ్రూప్-3 ఉద్యోగాలకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ కేబినెట్ భేటీ సందర్భంగా ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసే అవకాశముందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కేబినెట్ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
Andhra Pradesh
cabinet
Chandrababu
appsc
notifications

More Telugu News