vicky kaushal: సినిమా కోసం ఉద్యోగాన్ని వదులుకున్నప్పుడు భయం వేసింది: విక్కీ కౌశల్

  • చిన్న పాత్ర ద్వారా అవకాశం వచ్చింది
  • చేతిలో ఉన్న ఐటీ ఉద్యోగాన్ని వదులుకున్నా
  • నా వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు

అంతవరకూ చేస్తున్న ఐటీ ఉద్యోగాన్ని తనకెంతో ఇష్టమైన సినిమాల కోసం వదులుకున్నాడట బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్. మొదట ఓ చిన్న పాత్ర ద్వారా ఇతనికి అవకాశం వచ్చిందట. దీంతో భయపడిపోయాడట. సినిమాల కోసం చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదులకున్నానని.. కానీ ఏం జరిగినా సినిమాలను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నానని విక్కీ తన ఇన్‌స్టాగ్రాం ద్వారా వెల్లడించారు.

సంజు, రాజీ, మన్మర్జియా చిత్రాలతో ప్రేక్షకులకు మెప్పించిన ఆయన ఇన్‌స్టాగ్రాంలో తన సినీ రంగ ప్రవేశం ఎలా చేసిందీ? దానికోసం ఉద్యోగం వదులుకున్న విశేషాలను పంచుకున్నాడు. ‘‘కాలేజ్‌లో చదువుతున్నప్పుడు ఓ ఐటీ కంపెనీలో ఇంటర్వ్యూ కోసం వెళ్లాను. ఉద్యోగం ఇష్టం లేదు కానీ, ఇంటర్వ్యూ థ్రిల్ కోసం హాజరయ్యాను. మొత్తానికి ఇంటర్వ్యూలో ఎంపికయ్యాను.

కానీ నా ధ్యాసంతా నటనపైనే. విషయం నాన్నతో చెబితే మళ్లీ ఆలోచించమన్నారు. ఆయన యాక్షన్ డైరెక్టర్. సంసార బాధ్యతలను నెరవేర్చేందుకు చాలా కష్టపడ్డారు. అవకాశాలు రావడానికి నా వెనుక గాడ్ ఫాదర్స్ ఎవరూ లేరు. నాకు ఓ చిన్న పాత్ర ద్వారా తొలి అవకాశం వచ్చింది. చాలా భయపడ్డాను. సినిమాల కోసం చేతిలో ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకున్నా. కానీ సినిమాలను మాత్రం వదలకూడదని నిర్ణయించుకున్నా. ‘మసాన్’ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా చూసి నాన్న గర్వపడ్డారు.

నా జీవితం 'ఫలానా వ్యక్తి కుమారుడు విక్కీ' అనడం నుంచి 'విక్కీ తండ్రి ఆయన' అనడం దాకా వెళ్లిపోయింది. నేను అందుకున్న తొలి పారితోషికంతో కారు కొనుక్కున్నా. చిన్నప్పుడు నేను బాగా డబ్బులు సంపాదిస్తాను, కారు కొంటాను అని అమ్మతో చెబుతుండేవాడిని. ఈరోజు అమ్మ నేను కొన్న కారులో కూర్చుని... ‘నీకు గుర్తుందా..ఏదో ఒక రోజు కారు కొని అందులో నన్ను ఎక్కించుకుంటానని చెప్పావు. ఈరోజు నువ్వు చెప్పినట్లుగానే నీ కారులో కూర్చోబెట్టావ్‌’ అని ఉద్వేగానికి లోనైంది’’ అంటూ చెప్పుకొచ్చాడు విక్కీ కౌశల్.

More Telugu News