Chandrababu: ఐఏఎస్ అవుదామనుకున్నా... వారినే కంట్రోల్ చేయాలని రాజకీయాల్లోకి వచ్చా: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

  • 'యువనేస్తం' కార్యక్రమం ప్రారంభం
  • యువతకు నిర్దిష్టమైన గోల్ ఉండాలి
  • మంత్రిని కావాలని స్ట్రగుల్ చేశానన్న చంద్రబాబు

నేటి తరం యువతకు తమ భవిష్యత్తుపై ఓ ఆలోచన ఉండాలని, దాన్ని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'యువనేస్తం' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, యువత అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తాను చదువుకునే రోజుల్లో తన ఆలోచనలు ఎలా సాగాయన్న విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 "యువతకు ఒక నిర్దిష్టమైన గోల్ ఉండాలి. ఒక ఆలోచన ఉండాలి. నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు, ఎంఏ చేసేటప్పుడు అనుకున్నాను. ఏం చేద్దామని ఆలోచించాను. ఐఏఎస్ చేద్దామనుకున్నాను. ఐఏఎస్ చేయాలంటే కష్టపడాలి. ఇప్పట్లో మనం ఐఏఎస్ అవుతామో లేదో రిస్క్ అవుతుందని ఆలోచించి... నెక్ట్స్ నాకు 72లో ఎలక్షన్స్ వచ్చాయి. బెటర్ టూ కంటెస్ట్ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే అయిన తరువాత మంత్రి అవుదాం. ఐఏఎస్ ఆఫీసర్లను మనమే కంట్రోల్ చేయవచ్చని ఆలోచించాను" అన్నారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయగానే ఆడిటోరియం చప్పట్లు, నవ్వులతో దద్దరిల్లింది.

"అదే ఇప్పుడు జరుగుతావుంది. అంటే... ఆశయం బాగానే ఉంది. దానికి ప్రాక్టీస్ కూడా కావాలి. నేను ఎమ్మెల్యే కావాలని ఇంట్లో పడుకుని ఉంటే... ఊర్లలోకి పోయి వ్యవసాయం చేసేవాడిని. దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓ కాన్సిట్యూషన్ సెలక్ట్ చేసుకున్నాను. శాటర్ డే, సండే ఊర్లకు వెళ్లిపోయేవాడిని. మా స్టూడెంట్స్ అందరినీ తీసుకుని. ఊరంతా తిరిగే వాడిని. అందరితో పరిచయం పెంచుకున్నాను. అట్లా వన్ ఇయర్ తరువాత, ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యాను. ఎమ్మెల్యే కాగానే ఆనందపడలేదు. అక్కడి నుంచి మంత్రిని కావాలని అనుకున్నా. దానికి స్ట్రగుల్ చేశాను. ప్రయత్నం చేశాను" అన్నారు. ప్రస్తుతం ఈ స్థాయిలో తానున్నానంటే, ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకున్నానని చంద్రబాబు చెప్పారు.

More Telugu News