Sabarimala: సుప్రీం తీర్పుతో శబరిమలలో మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. మహిళల ప్రవేశానికి బోర్డు రెడీ!

  • మహిళల కోసం శబరిమలలో ప్రత్యేక ఏర్పాట్లు
  • పంబలో ప్రత్యేక టాయిలెట్లు, స్నానాల ఘాట్లు
  • బస్సుల సీట్లలో 25 శాతం రిజర్వేషన్

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆలయ బోర్డు మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పంపానది వద్ద మహిళల కోసం ప్రత్యేక ఘాట్లు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక టాయిలెట్లు, బస్సుల్లో మహిళలకు సీట్లలో రిజర్వేషన్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు దేవస్థానం బోర్టు సన్నాహాలు చేస్తోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

పంపానది నుంచి సన్నిధానం వరకు ఉన్న అడవి మార్గంలో లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి కడకంపల్లి సురేశన్‌ వెల్లడించారు. మహిళల కోసం ‘మహిళా మిత్ర’ టాయిలెట్లను ఏర్పాటు చేస్తామని, నీలక్కల్-పంప మధ్య నడిచే ఆర్టీసీ బస్సుల్లో 25 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు మహిళా కానిస్టేబుళ్లను నియమిస్తామని పేర్కొన్నారు. అయితే, మహిళల కోసం ప్రత్యేకంగా క్యూలు ఏర్పాటు చేయడం అసాధ్యమని, కాబట్టి వారు పురుషులతో కలిసే వెళ్లాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

More Telugu News