Nara Lokesh: ఐదెకరాల మెట్ట భూమి ఉన్నా నిరుద్యోగ భృతికి అర్హులే: లోకేశ్

  • ఏపీలో నేటి నుంచి ముఖ్యమంత్రి యువనేస్తం పథకం ప్రారంభం
  • ప్రయోగాత్మకంగా లబ్ధిదారుల ఖాతాల్లో రూపాయి జమ
  • అక్టోబరు 3న  మిగతా రూ.999 జమ చేయనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి నిరుద్యోగ భృతి పథకం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద లబ్ధి పొందేవారు ఇకపై ప్రతినెలా బయోమెట్రిక్ ద్వారా వారి సొంత గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో వేలిముద్రలు వేయాల్సి ఉంటుందన్నారు. అయితే, సెప్టెంబరు నెలకు మాత్రం దీనిని మినహాయించినట్టు చెప్పారు. లబ్ధిదారులు రాష్ట్రంలోనే ఉంటున్నదీ? లేనిదీ తెలుసుకునేందుకే ఈ నిబంధనను తీసుకొచ్చినట్టు తెలిపారు.

రెండున్నర ఎకరాల మాగాణి, ఐదెకరాల మెట్టభూమి ఉన్న వారికి  నిరుద్యోగ భృతి వర్తించదంటూ ఉన్న నిబంధనను తొలగిస్తున్నట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉంటే అర్హులుగా పరిగణిస్తామన్నారు. యువనేస్తం పథకంలో భాగంగా స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్ విధానంలో శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభిస్తామన్నారు. అయితే, లబ్ధిదారులు కచ్చితంగా ఈ శిక్షణ పొందాలన్న నిబంధన ఏమీ లేదని స్పష్టం చేశారు. అలాగే, పోటీ పరీక్షలకు కూడా శిక్షణ ఇచ్చే ఏర్పాట్లను నవంబరు నెలాఖరుకు పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకానికి ఆరు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్టు లోకేశ్ తెలిపారు.

సోమవారం నాటికి 1.86 లక్షల మంది ఖాతాలో ప్రయోగాత్మకంగా రూపాయి జమచేసినట్టు మంత్రి లోకేశ్ తెలిపారు. మిగిలిన రూ.999 బుధవారం జమ అవుతాయన్నారు. లబ్ధిదారులకు ఉద్యోగం వస్తే పథకానికి అనర్హులవుతారని చెప్పారు. సోమవారం అర్ధరాత్రి వరకు ధ్రువీకరించిన అందరికీ సెప్టెంబరు నెల నిరుద్యోగ భృతి అందుతుందని మంత్రి లోకేశ్ తెలిపారు.

More Telugu News