sumitra mahajan: అభివృద్ధి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదు!: లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ సంచలన వ్యాఖ్యలు

  • మన ఆలోచనలు, చేతలు మారితే చాలు
  • రిజర్వేషన్ల కారణంగా దేశం ఏం బాగుపడింది
  • జార్ఖండ్ లో ప్రసంగించిన స్పీకర్ 

దళితులు, ఇతర వెనుకపడిన వర్గాలకు అందజేస్తున్న రిజర్వేషన్లపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్ఖండ్ లో జరిగిన ‘లోక్ మానథాన్’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక సామరస్యం సాధించేందుకు వీలుగానే అంబేడ్కర్ రిజర్వేషన్లు తీసుకొచ్చారని తెలిపారు. కానీ రిజర్వేషన్ల కారణంగా ఆయా రంగాల్లో తీవ్రమైన శూన్యత ఏర్పడిందని వ్యాఖ్యానించారు. తొలుత పదేళ్లకు మాత్రమే అనుకున్న రిజర్వేషన్లను పెంచుకుంటూ పోవడం వల్ల దేశానికి ఎలాంటి ప్రయోజనం లభించలేదని అభిప్రాయపడ్డారు.

అభివృద్ధి, సామాజిక ప్రగతి సాధించాలంటే రిజర్వేషన్లు అవసరం లేదనీ, మన ఆలోచనలను, చేతలను మార్చుకోవాలని మహాజన్ తెలిపారు. అలా చేసినప్పుడే అంబేడ్కర్ కన్న కలలు సాకారం అవుతాయని వెల్లడించారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వాటిని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంగా బీజేపీ చీఫ్ అమిత్ షా అభివర్ణించారు. తాము రిజర్వేషన్ల ఉపసంహరణ జోలికి పోమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

More Telugu News