Revanth Reddy: ఆ నలుగురూ తెలంగాణకు పట్టిన కొరివి దెయ్యాలు: రేవంత్ రెడ్డి

  • కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేసుకున్న రేవంత్
  • నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఎక్కడ?
  • నెలకు రూ. 30 లక్షలు వేతనం తీసుకుంటున్న కేసీఆర్ కుటుంబం
  • ఎన్నికల్లో ఓడించాలని పిలుపు
కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కవితలు తెలంగాణకు పట్టిన నాలుగు కొరివి దెయ్యాలని రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కామారెడ్డి జిల్లాలో రోడ్ షో నిర్వహించిన ఆయన పట్టణంలోని నిజాంసాగర్ జంక్షన్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదుగానీ, ఆయన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఆయన ఇంట్లోని ఐదుగురూ కలిపి నెలకు రూ. 30 లక్షల జీతాన్ని తీసుకుంటున్నారని ఆరోపించిన రేవంత్, టీఆర్ఎస్ ను సాగనంపే రోజు వచ్చిందని అన్నారు.

ప్రతి ప్రాజెక్టులో, ప్రతి పనిలో కమిషన్ లు తీసుకుంటున్న ఎల్లారెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని ఓడించాలని, ఇసుకను, కంకరను దోచుకుంటున్న పోచారం కుమారుల అవినీతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. నియోజకవర్గాన్ని దోచేస్తున్న గంప గోవర్థన్ కు ప్రజలు తమ ఓటు హక్కుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నేతలు కొందరు టీఆర్ఎస్ లో చేరిన విషయాన్ని ప్రస్తావిస్తూ, కొంతమంది సన్నాసులు పోతే కాంగ్రెస్ కు ఎలాంటి నష్టమూ లేదని అన్నారు.

లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాలు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి ఎక్కడని రేవంత్ ప్రశ్నించారు. బోధన్ లో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరచుకోకపోవడానికి కేసీఆరే కారణమని, ఆయన ఉద్యోగం ఊడిపోతే, వంద రోజుల్లో లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇక్కడ పోటీలో కాంగ్రెస్ తరఫున నిలిచే షబ్బీర్ అలీని గెలిపిస్తే, ఎన్నికల తర్వాత ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన తొలి రెండు స్థానాల్లో ఉంటారని, నియోజకవర్గ ప్రజలకు మేలు కలుగుతుందని అన్నారు.
Revanth Reddy
KCR
Telangana
KTR
Kamareddy District
Bodhan
Elections
K Kavitha

More Telugu News