yuvanestam: 3న లబ్ధిదారుల ఖాతాల్లోకి ‘యువ నేస్తం’ భృతిని జమ చేయండి: అధికారులను ఆదేశించిన చంద్రబాబు

  • పథకాన్ని విజయవంతం చేయాలని యువతకు పిలుపు
  • పరిపాలనా బాధ్యులతో సీఎం టెలికాన్ఫరెన్స్‌
  • ఏపీ ప్రకృతి సేద్యం ప్రపంచానికి నమూనా కావాలని సూచన

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘యువ నేస్తం’ పథకం ‘భృతి’ని బుధవారం నాటికి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికీ నెలకు వెయ్యి రూపాయలు ప్రభుత్వం అందించనున్న విషయం తెలిసిందే. సోమవారం సీఎం ‘నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతి’పై అధికారులతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకుని పథకాన్ని విజయవంతం చేయాలని కోరారు. అటు ప్రకృతిని, ఇటు సాంకేతికతను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవడం వల్లే రాష్ట్రం ప్రకృతి సేద్యంలో అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకుందని, ఐక్యరాజ్య సమితిలో రాష్ట్రానికి మంచి ఖ్యాతి లభించిందని అన్నారు. ప్రకృతి సేద్యంలో ఏపీ ప్రపంచానికే నమూనాగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా 19 శాతం వర్షపాతం లోటుందని చెప్పారు. జల సంరక్షణ చర్యలు, సమర్థ నీటి వినియోగమే కరవుకు పరిష్కారమని సూచించారు. ఖరీఫ్‌ దిగుబడిపై ముందస్తు అంచనాలు వేయడంతో పాటు రబీ విత్తనాల పంపిణీపై శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

‘నీరు-మీరు’ పథకం కింద ఈ ఏడాది ఇప్పటి వరకు 15.7 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని, ఇందుకోసం 4 వేల 893 కోట్ల రూపాయు వెచ్చించినట్లు తెలియజేశారు. ఇంకా ఏడు వేల కోట్ల రూపాయలు వినియోగించుకోవాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా ప్రణాళికు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

More Telugu News