Andhra Pradesh: ప్రారంభానికి ముందే రికార్డులు బద్దలుగొడుతున్న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’.. రేపటి నుంచే ప్రారంభం!

  • ఇప్పటికే రెండు లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య
  • ప్రతీ నెలా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు
  • మూడో తేదీన లబ్ధిదారుల ఖాతాల్లోకి వెయ్యి రూపాయలు

నిరుద్యోగుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘యువనేస్తం’ పథకం ప్రారంభానికి ముందే రికార్డులు కొల్లగొడుతోంది. ఈ పథకం కింద అర్హులైన వారి సంఖ్య ఇప్పటికే 2 లక్షలు దాటింది. దేశంలోని మరే రాష్ట్రంలోనూ అర్హుల సంఖ్య 20 వేలకు మించలేదు. దీంతో ఇదో రికార్డుగా ప్రభుత్వం భావిస్తోంది. అక్టోబరు 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది. ఉండవల్లిలో మంగళవారం నిర్వహించనున్న కార్యక్రమంలో లబ్ధిదారులతో చంద్రబాబు మాట్లాడనున్నారు. అనంతరం యువనేస్తం ధ్రువపత్రాలు అందిస్తారు.

యువనేస్తం దరఖాస్తు కోసం ప్రత్యేకంగా నిర్ణీత గడువు అంటూ ఏమీ లేదు. ఇదో నిరంతర ప్రక్రియ. ప్రతీనెల 25వ తేదీ వరకు వచ్చే దరఖాస్తులను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. అనంతరం అర్హులను వచ్చే నెల జాబితాలో చేర్చుతారు. కాగా, గాంధీ జయంతి సందర్భంగా సెలవు కావడంతో లబ్ధిదారుల ఖాతాల్లో మూడో తేదీన భృతి వెయ్యి రూపాయలు జమ అవుతుంది.  
 
యువనేస్తంలో భాగంగా నిరుద్యోగ భృతికి అర్హత ఉన్నా.. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉన్న వారు ఈ పథకం నుంచి స్వచ్ఛందంగా వైదొలగేందుకు వెబ్‌సైట్‌లో ‘ఆప్ట్‌ అవుట్‌’ అనే ఆప్షన్‌ ఇచ్చారు. ఈ ఆప్షన్‌ను కూడా వేలాదిమంది ఎంచుకోవడం గమనార్హం. కొందరు పొరపాటున ఈ ఆప్షన్ ఎంచుకోవడంతో అటువంటి వారి కోసం 1100 టోల్‌ఫ్రీ నంబరులో ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. ఈ నంబరుకు లబ్ధిదారులు ఫోన్ చేసి అర్హుల జాబితాలో తమను చేర్చాలని కోరవచ్చు.

యువనేస్తం పథకం అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందని, ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అర్హులందరికీ లబ్ధి జరుగుతుందన్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత శాఖల్లో నోడల్ అధికారులను నియమించామని, సర్వర్ స్తంభించిపోకుండా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు.

More Telugu News