Facebook: ఫేస్ బుక్ ఖాతా ఉందా? భద్రత కోసం వెంటనే ఈ పని చేయండి!

  • రెండు దశల్లో రీ లాగిన్ ప్రక్రియ
  • ఇటీవల 5 కోట్ల మంది ఖాతాలు హ్యాక్
  • నష్ట నివారణ చర్యల్లో ఫేస్ బుక్
  • వినియోగదారులకు కీలక సూచనలు

సుమారు 5 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాలు ఇటీవల హ్యాక్ కాగా, నష్టనివారణకు దిగిన సంస్థ, ఖాతాదారులకు కీలక సలహాలు ఇచ్చింది. ప్రతి ఒక్క యూజర్, ఫేస్ బుక్ లో లాగౌట్ అయ్యి, రీ లాగిన్ కావాలని, ఈ క్రమంలో 'టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్' పద్ధతిలో సాగుతుందని తెలిపింది.

దీని వల్ల ఖాతాలకు మరింత భద్రత ఏర్పడుతుందని పేర్కొంది. రీ లాగిన్ అయిన తరువాత, కుడివైపు పైన కనిపించే సెట్టింగ్స్ లోకి వెళ్లి, 'సెక్యూరిటీ అండ్ లాగిన్' ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపింది. ఈ విభాగంలో 'చేంజ్ పాస్ వర్డ్', 'లాగిన్ విత్ యువర్ ప్రొఫైల్ పిక్చర్' అనే ఆప్షన్లు కనిపిస్తాయని తెలిపింది. వీటి కింద 'టూ ఫాక్టర్ ఆథెంటికేషన్' అన్న ఆప్షన్ ను జోడించామని, దీన్ని క్లిక్ చేయడం ద్వారా ఎకౌంట్ ను మరింత భద్రంగా ఉంచుకోవచ్చని పేర్కొంది.

ఇందులో టెక్ట్స్ మెసేజ్ ఆప్షన్ ఎంచుకుంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు ఆరు అంకెల కోడ్ ను పంపిస్తామని, లాగిన్ కావడానికి దాన్ని ఎంటర్ చేయాల్సి వుంటుందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో గూగుల్ ఆథెంటికేటర్ ద్వారా కూడా లాగిన్ కావచ్చని వెల్లడించింది. గూగుల్ ద్వారా అయితే, కంప్యూటర్ స్క్రీన్ పై కనిపించే క్యూఆర్ కోడ్ ను రిజిస్టర్డ్ మొబైల్ నుంచి స్కాన్ చేయాల్సి వుంటుందని తెలిపింది.

More Telugu News