Rohit Sharma: ఆసియా కప్ లో ఆడకుండా కోహ్లీ పొరపాటు చేశాడా?

  • ఆసియా కప్ లో టీమిండియాను విజేతగా నిలిపిన రోహిత్
  • రోహిత్ కెప్టెన్సీపై సర్వత్ర కురుస్తున్న ప్రశంసలు
  • పూర్తి స్థాయి కెప్టెన్సీ చేపట్టడానికి సిద్ధమన్న రోహిత్

అత్యంత కీలకమైన ఆసియా కప్ నుంచి విశ్రాంతి తీసుకుని టీమిండియా కెప్టెన్ కోహ్లీ తప్పు చేశాడా? రోహిత్ శర్మకు చేజేతులా గొప్ప అవకాశాన్ని ఇచ్చాడా? రోహిత్ శర్మ మాటలు వింటుంటే అవుననే అనిపిస్తోంది. రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ విజేతగా నిలిచింది. ముఖ్యంగా దాయాది దేశం పాకిస్థాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఈ నేపథ్యంలో, రోహిత్ కెప్టెన్సీపై ప్రశంసలు కురుస్తున్నాయి. టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా రోహిత్ ను ప్రశంసించాడు.

ఈ సందర్భంగా మీడియాతో రోహిత్ మాట్లాడుతూ, అవకాశం వస్తే టీమిండియాకు పూర్తి స్థాయి కెప్టెన్ గా వ్యవహరించడానికి తాను సిద్ధమని చెప్పాడు. కెప్టెన్సీలో ఎన్నో సవాళ్లు ఉంటాయని... గెలిచినప్పుడు పొగిడిన వారే, ఓడిపోయినప్పుడు విమర్శిస్తారని అన్నాడు. జట్టులో ఉన్న ఆటగాళ్లతో సమన్వయం ఏర్పరుచుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. ఏ ఒక్క ఆటగాడు అసంతృప్తితో ఉన్నా... ఆ ప్రభావం కెప్టెన్ మీద, ఆట మీద పడుతుందని తెలిపాడు.

కెప్టెన్ కన్నా ముందు తానొక ఆటగాడినని.... ప్లేయర్ గా తాను ఎలా ఆలోచిస్తానో... ఇతర ఆటగాళ్లు కూడా అలాగే ఆలోచిస్తారని రోహిత్ చెప్పాడు. ఆసియా కప్ లో తాము ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదని... మ్యాచులన్నీ ఎంజాయ్ చేస్తూ ఆడామని తెలిపాడు. పూర్తి స్థాయి కెప్టెన్సీపై రోహిత్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

More Telugu News