Revanth Reddy: కేసీఆర్ ఉసిగొల్పిన జంతువు నాపై ఆరోపణలు చేస్తోంది.. ఏటా ఆస్తుల విలువ పెరగదా?: రేవంత్ రెడ్డి

  • 2009లో రిజిస్ట్రేషన్ విలువ ప్రకటించాను
  • ఈసీ 2014లో మార్కెట్ విలువ చెప్పాలంది
  • మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్

తెలంగాణలో అధికారం నిలబెట్టుకోవడంలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. జగ్గారెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, వెంకట రమణారెడ్డితో పాటు తాజాగా తనను టార్గెట్ గా చేసుకున్నారని విమర్శించారు. కేసీఆర్ రెచ్చగొట్టిన ఓ వింత జంతువు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని వెల్లడించారు. ఈ రోజు హైదరాబాద్ లోని తన ఇంట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడారు.

తాను తొలిసారి 2007లో శాసన మండలికి ఎన్నికయ్యాయని రేవంత్ తెలిపారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆస్తుల కొన్న విలువను ప్రకటించానని వెల్లడించారు. అప్పుడు ఆస్తుల విలువ రూ. 2-3 కోట్లుగా ఉందన్నారు. 2014 నాటికి ఎన్నికల సంఘం ఆస్తుల మార్కెట్ విలువను ప్రకటించాలని సూచించిందని పేర్కొన్నారు. దీంతో తన ఆస్తుల విలువ ఒక్కసారిగా రూ.12-14 కోట్లకు చేరుకుందన్నారు.

వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి తన ఆస్తుల విలువ ఇంకా పెరిగే అవకాశముందనీ, ఇందులో వింత ఏముందని రేవంత్ ప్రశ్నించారు. ఈసీ నిర్ణయంతో పాతికేళ్ల క్రితం బంజారాహిల్స్ లో రూ.25 లక్షలకు కొన్న ఇంటి విలువ కోట్లలోకి వెళ్లిపోయిందన్నారు. 2014లో తన పేర ఉన్న ఆస్తులను 2009లో ఉన్నవాటితో పోల్చిచూడాలని ఆయన సూచించారు. కేసీఆర్ తిని పారేసే బొక్కలు (మాంసం ఎముకలు) ఏరుకునే సన్నాసులు తనపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

More Telugu News