Telangana: సెల్‌ఫోన్‌లో సమాచారం చోరీ చేసి మహిళకు లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్ట్!

  • మరమ్మతుల కోసమని వెళితే హ్యాకింగ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌
  • బాధితురాలి మాటలు, చాట్స్‌, వీడియోలు సంగ్రహణ
  • అనంతరం వాటిని చూపి బెదిరింపులు

సెల్‌ఫోన్‌ మొరాయించడంతో బాగు చేయించుకుందామని ఆ షాపుకి వెళ్లడం ఆమె పొరపాటయింది. అక్కడి ఓ ప్రబుద్దుడి ‘సాంకేతిక’ చోరీతో లైంగిక వేధింపులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా మానసిక వేదన అనుభవిస్తున్న బాధితురాలు విసిగిపోయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో సదరు యువకుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు.

వివరాల్లోకి వెళితే...ఓ వివాహిత తన సెల్‌ఫోన్‌ పనిచేయక పోవడంతో హైదరాబాద్‌ నగరం బోరబండ సైట్‌-2లోని సిటీ మొబైల్స్‌ అనే షాపులో  మరమ్మతుకు ఇచ్చింది. రెండు రోజులపాటు సెల్‌ఫోన్‌ తనవద్దే ఉంచుకున్న దుకాణదారుడు నఫీస్‌ అలియాస్‌ జఫర్‌ సెల్‌ఫోన్‌లో సమాచారాన్ని హ్యాక్‌చేసే సాఫ్ట్‌వేర్‌ ఉంచి ఆమెకు ఇచ్చాడు. అనంతరం తానుంచిన సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా సదరు గృహిణి మాట్లాడే సంభాషణలు, వాట్సాప్‌ సమాచారం, వీడియోలు, చాటింగ్‌ సమాచారాన్ని దొంగిలించాడు.

తర్వాత వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించాడు. తనను పెళ్లి చేసుకోవాలని, కోరిక తీర్చాలని, తన మాట వినకుంటే సెల్‌ఫోన్‌లోని సమాచారం సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బాధితురాలిని మోతీనగర్‌లోని  ఓ పార్క్‌ వద్దకు రమ్మని చెప్పి అక్కడ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

More Telugu News