Andhra Pradesh: కిడారి కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు.. కుమారులను ఓదారుస్తూ కంటతడి పెట్టుకున్న సీఎం!

  • గిరిజనుల సంక్షేమం కోసం కిడారి పోరాడారు
  • ఆయనకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు
  • కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటన

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు పరామర్శించారు. అమెరికా నుంచి నేరుగా చేరుకున్నాక ఈ రోజు ఉదయం విశాఖ జిల్లా పాడేరుకు బయలుదేరి వెళ్లారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటాననీ, భయపడవద్దని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సర్వేశ్వరరావు కుమారులు సందీప్, శ్రవణ్ లను ఒదార్చిన చంద్రబాబు ఓ దశలో తాను కన్నీళ్లు పెట్టుకున్నారు.

‘మీ కుటుంబానికి అండగా నేనుంటా’ అని ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. కిడారి ఎప్పుడూ అభివృద్ధి గురించే మాట్లాడేవాడని తెలిపారు. ఆయన ఇద్దరు కుమారులను తాను ఇప్పుడే చూస్తున్నానని వెల్లడించారు. అలాంటి అంకిత భావం ఉన్న నేతను కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజా సేవకు వెళ్లిన కిడారిని మావోలు హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులను చంపితే ప్రజలకే నష్టమనీ, దీనివల్ల ఎలాంటి లాభం జరగదని వ్యాఖ్యానించారు.

పాడేరు, అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.కోటి నగదు సాయంతో పాటు ఓ కుమారుడికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అలాగే పార్టీ తరఫున రూ.15 లక్షల సాయం అందిస్తామన్నారు. కిడారి కుటుంబానికి సొంత ఇల్లు లేదనీ, ఇంకా ప్రభుత్వ క్వార్టర్లలోనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి వైజాగ్ లో ఇంటి స్థలం కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా పాడేరు టికెట్ ను ఎవరికి ఇస్తారని మీడియా ప్రశ్నించగా.. ఇప్పుడు దానిపై మాట్లాడటం సరైనది కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా కిడారి సర్వేశ్వరరావు అనుచరులు, టీడీపీ కార్యకర్తలు జోహోర్ కిడారి సర్వేశ్వరరావు జోహార్, అమర్ రహే కిడారి సర్వేశ్వరరావు అమర్ రహే అంటూ ఆ ప్రాంతమంతా దద్దరిల్లేలా నినాదాలు చేశారు. కిడారి కుటుంబాన్ని ఓదార్చిన చంద్రబాబు అనంతరం అరకులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత సివేరి సోమ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరారు.

స్థానికంగా సాగుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా, కేడర్ లో ధైర్యం నింపేందుకు మావోయిస్టులు గత ఆదివారం ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమలను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు నేరుగా ఏపీకి చేరుకున్నారు. విజయవాడ నుంచి హెలికాప్టర్ లో పాడేరుకు చేరుకుని కిడారి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సోమ కుటుంబీకులను కలుసుకునేందుకు అరకుకు బయలుదేరారు.

More Telugu News