Supreme Court: సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన శబరిమల ప్రధానార్చకుడు!

  • తీర్పు సహేతుకంగా లేదని వ్యాఖ్య
  • పరిశీలించాక కార్యాచరణ చేపడతామన్న దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు
  • రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు వెల్లడించిన ధర్మసేన అధ్యక్షుడు

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చునన్న సుప్రీం కోర్టు తీర్పుపై ఆలయ ప్రతినిధుల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. అయ్యప్ప ఆలయం ప్రధాన పూజారి కందరారు రాజీవరు స్పందిస్తూ ‘కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, అమలు చేస్తాం కూడా.. కానీ థార్మిక అంశాలతో ముడిపడివున్న సమస్యపై  కోర్టు ఇచ్చిన తీర్పు సహేతుకంగా లేదు’ అని వ్యాఖ్యానించారు.

ట్రావెన్‌కోర్‌ దేవస్వామ్‌ బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్‌ స్పందిస్తూ తీర్పు ప్రతి అందాక సమగ్రంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారాన్ని కొనసాగిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన విషయాన్ని ప్రస్తావించారు. ‘మా విన్నపాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ఇక మాకు మరో మార్గం లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

కోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు అయ్యప్ప ధర్మసేన అధ్యక్షుడు రాహుల్‌ ఈశ్వర్‌ వెల్లడించారు. అయ్యప్ప ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని సవాల్‌ చేస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ కేసును విచారించిన అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం అందరికీ ఆలయ ప్రవేశం కల్పిస్తూ తీర్పునిచ్చింది.

More Telugu News