assembly seats: నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం దృష్టి?

  • ఎలా చేపట్టాలో తెలపాలని కోరిన కేంద్రహోంశాఖ
  • ఎస్సీఎస్టీ నియోజకవర్గాల పునర్విభజనపైనే చిక్కులు
  • మిగిలిన శీతాకాల సమావేశాల్లో సాధ్యమయ్యేనా?

తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశంపై కేంద్రం కసరత్తు ప్రారంభించిందా? సార్వత్రిక ఎన్నికలు ముంచుకు వస్తుండడం, తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఇది సాధ్యమేనా?... అంటే, పరిశీలకులు అవునన్న సమాధానమే చెబుతున్నారు. సీట్ల పెంపు జోలికి వెళితే ఆ ప్రభావం ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఉన్నందున ఏ ప్రాతిపదికన సీట్లు పెంచాలో తెలియజేయాలని ఎన్నికల కమిషన్‌ను కేంద్రహోం శాఖ కోరినట్లు తెలిసింది.

2011 జనాభా లెక్క ప్రకారం దీనిని చేయాలని రిజిస్ట్రార్‌ కోరగా, 2001 జనాభా లెక్కను ప్రాతిపదికగా తీసుకోవాని హోంశాఖ ముందుగానే నిర్ణయించినట్లు సమాచారం. రిజిస్ట్రార్‌ సూచించినట్లు ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలకు 2011 జనాభాలెక్కలను, జనరల్‌ నియోజకవర్గాలకు 2001 లెక్కలను తీసుకుంటే న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందా, అభ్యంతరాలు వస్తే ఏం చేయాలి? అనే దానిపై హోంశాఖ తర్జనభర్జన పడుతున్నట్లు తెలిసింది.

సీట్ల సంఖ్యను పెంచాలంటే రాజ్యాంగంలోని 170 అధికరణను సవరించాలి. ఈ ప్రక్రియ పూర్తిచేస్తే నియోజకవర్గాల పునర్విభజనకు మూడు నెలల సమయం అవసరమవుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి శీతాకాల సమావేశాలతో పాటు బడ్జెట్‌ సమావేశాలే ఇంకా మిగిలాయి. బడ్జెట్‌ సమావేశాల్లో ఎలాగూ సాధ్యం కాదు. శీతాకాల సమావేశాల్లోనే ఏదైనా జరగాల్సి ఉంది. అయితే, దీనిపై ప్రభుత్వం దృష్టిపెడుతుందా? అన్నదే ఇప్పుడు సమస్య.

రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించి సీట్ల పెంపు చేసుకోవచ్చని కొందరు సూచిస్తున్నా కేంద్రహోం శాఖ ఈ వాదనను పరిగణనలోకి తీసుకోవడం లేదన్నది సమాచారం. ఈ పరిస్థితుల్లో రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరుగుతుందన్న దానిపైనే సీట్ల పెంపు అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. సీట్ల పెంపు జరిగితే ఆంధ్రాలో సీట్లు 175 నుంచి 225కు, తెలంగాణలో 117 నుంచి 153కు సీట్లు పెరగనున్నాయి. కసరత్తు పూర్తయ్యేసరికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిపోనుండడంతో ఎక్కువ లాభపడేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమే!

  • Loading...

More Telugu News