chintamaneni: చింతమనేని లాంటి వ్యక్తిని ఏపీ విప్ గా పెట్టినందుకు సిగ్గుపడాలి!: పవన్ కల్యాణ్ ఫైర్

  • క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోరే?
  • రౌడీలు చట్టసభల్లో పిచ్చివాగుడు వాగుతున్నారు
  • గూండాయిజం చేస్తూ, రాజకీయం చేస్తామంటే ‘ఖబడ్దార్’

చింతమనేని ప్రభాకర్ లాంటి వ్యక్తిని ఏపీ ప్రభుత్వ విప్ గా పెట్టినందుకు సిగ్గుపడాలని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని దెందులూరులో ‘జనసేన’ పోరాట యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పవన్ మాట్లాడుతూ, క్రమశిక్షణ తప్పిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాజ్యాంగేతర శక్తులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము పోరాటయాత్రకు వస్తుంటే సభ ఎలా పెడతారో చూస్తామని తమను బెదిరించారని, ఇలాంటి ఆకు రౌడీలను, గాలి రౌడీలను పదహారేళ్ల వయసు నుంచే తాను చూస్తున్నానని అన్నారు. రౌడీలు చట్టసభలకు వచ్చి పిచ్చివాగుడు వాగుతున్నారని, గూండాయిజం చేస్తూ, రాజకీయం చేస్తామంటే ‘ఖబడ్దార్’ అని హెచ్చరించారు.

27 కేసులున్న దెందులూరు ఎమ్మెల్యేను చట్టసభల్లో కూర్చోబెట్టారని, రౌడీ రాజకీయాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేయాలని ప్రశ్నించారు. చింతమనేనిపై  యాక్షన్ తీసుకోకపోవడానికి గల కారణాలేమిటో చెప్పాలని, న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే రౌడీ ఎమ్మెల్యేలు జైల్లో ఉంటారని అన్నారు. చింతమనేని విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోంది? మీరు చర్యలు తీసుకుంటారా? మమ్మల్ని చర్య తీసుకోమంటారా? అని ప్రశ్నించిన పవన్, జనం కోసం జనసైనికులు ఉన్నారని, తానే కనుక రెచ్చగొట్టాలనుకుంటే అగ్నిగుండం సృష్టించగలనని అన్నారు.

More Telugu News