West Bengal: 20 కాల్ సెంటర్లు, 400 మంది ఉద్యోగులు... అమ్మాయిలను ఎరగా వేసి కోట్ల మోసం!

  • అందమైన అమ్మాయిలను ఎరగా చూపే వెబ్ సైట్లు
  • కాల్ చేస్తే, మాయమాటలు చెప్పే అమ్మాయిలు
  • లక్షల్లో వసూలు చేసి ఫోన్ స్విచ్ ఆఫ్

ఆన్ లైన్ మాధ్యమంగా అందమైన అమ్మాయిలను ఎరచూపుతూ, వారి పట్ల ఆకర్షితులైన వారే లక్ష్యంగా మోసాలు చేస్తూ కోట్లు గడిస్తున్న ఓ జంట ఆటను సైబరాబాద్ పోలీసులు కట్టించారు. మోసపోయే వారి నుంచి కోట్ల రూపాయలను దండుకున్న వీరు, పశ్చిమ బెంగాల్ కేంద్రంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించి, దేశవ్యాప్తంగా విస్తరించారు. వివిధ ప్రాంతాల్లో 20 కాల్ సెంటర్లు ఏర్పాటు చేసుకుని 600 మంది ఉద్యోగులను నియమించుకుని తమ దందాను సాగిస్తుండటం గమనార్హం. వీరి చేతుల్లో మోసపోయిన ఓ హైదరాబాద్ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తీగలాగగా, డొంకంతా కదిలింది.

www.getyourlady.com, www. mylove18.in, www.worlddating.com... ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? ఆన్ లైన్ లో అమ్మాయిలను డేటింగ్ కు పంపించే వెబ్ సైట్లు. అందమైన అమ్మాయిల ఫొటోలు ఈ వెబ్ సైట్ల లోనికి వెళితే కనిపిస్తాయి. సరదాగా అమ్మాయితో కాసేపు గడుపుదామని అనుకుని, వారు ఇచ్చిన ఫోన్ నంబరుకు కాల్ చేస్తే, హస్కీ వాయిస్ తో అమ్మాయి మాట్లాడుతుంది. మెంబర్ షిప్ ఫీజు, రిజిస్ట్రేషన్, క్లబ్ లైసెన్స్, సేవా ఫీజుల పేరిట లక్షల్లో వసూలు చేస్తారు. ఆపై వారు ఎంతగా కాల్ చేసినా దొరక్కుండా తప్పించుకుంటారు.

పశ్చిమ బెంగాల్ కు చెందిన దేబాశిష్ ముఖర్జీ మొత్తం దందాకు కీలక సూత్రధారి కాగా, ఫైజుల్ హక్ అలియాస్ విస్కీరాయ్ ఇతని భాగస్వామి. వీరిద్దరూ కలసి ఎస్కార్ట్ సర్వీసెస్ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించారు. అనితాడే అలియాస్ తనీషా అనే మహిళ టెలీ కాలర్లను ఎంపిక చేసేది. బయటకు ఆయుర్వేద, ఎరువుల సంస్థల పేరిట కార్యాలయాలు ఏర్పాటు చేసి, వాటిల్లో టెలీకాలర్ల జాబులంటూ అమ్మాయిలను మోసం చేసి, ఆపై అసలు విషయాన్ని చెబుతారు. అబ్బాయిలతో మంచిగా మాట్లాడి, వారి నుంచి ఎంత మొత్తాన్ని గుంజితే, అంత కమిషన్లు ఇచ్చేవారు. అన్ని అశ్లీల వెబ్ సైట్లలో ప్రకటనలు, ఫోన్ నంబర్లు ఇచ్చిన వీరు, సిలిగురిలో 12, కోల్ కతాలో 8 కాల్ సెంటర్లను నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్ యువకుడు ఒకరు, తనకు హైదరాబాద్ లో ఉండే అమ్మాయి కావాలని వారిని సంప్రదించగా, రియా అనే యువతి నుంచి ఫోన్ వచ్చింది. సభ్యత్వం కోసం రూ. 1,080, క్లబ్ సైసెన్స్ కోసం రూ. 15,600, రిజిస్ట్రేషన్ కింద రూ. 27,600, లైసెన్స్ ఫీజుగా రూ. 37,700, సేవా రుసుము కింద రూ. 50 వేలు, జీఎస్టీ కింద రూ. 87,634, వ్యక్తిగత వివరాల విచారణ పేరిట రూ. 4.5 లక్షలు చెల్లించాడు. చివరిగా చెల్లించిన రూ. 4 లక్షల తరువాత రియా ఫోన్ నంబర్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో మోసపోయానని గుర్తించి అతను పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో కోల్ కతాలో దాడులు జరిపి సందీప్ మిత్రా, నీతా శంకర్ అనే కాల్ సెంటర్ మేనేజర్లను అరెస్ట్ చేశామని, ప్రధాన నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వీరి నుంచి మోసపోయిన వారి వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు.

More Telugu News