కాజోల్ ఫోన్ నంబర్ ను ట్విట్టర్ లో పెట్టిన అజయ్ దేవగణ్... ఈ వేషాలు ఇంట్లో కుదరవని కాజోల్ వార్నింగ్!

25-09-2018 Tue 11:19
  • పొరపాటున భార్య నంబర్ షేర్ చేసిన అజయ్
  • వాట్స్ యాప్ లో మెసేజ్ మీద మెసేజ్ చేస్తున్న ఫ్యాన్స్
  • 'ప్రాంక్' అని వివరణ ఇచ్చినా వినని అభిమానులు

పొరపాటున తన భార్య కాజోల్ మొబైల్ నంబరును ట్విట్టర్ లో షేర్ చేసిన అజయ్ దేవగణ్, ఇప్పుడు తలపట్టుకుని కూర్చున్నాడు. "కాజోల్ ప్రస్తుతం ఇండియాలో లేదు. ఆమెను వాట్స్ యాప్ నంబర్ '9820123300'లో సంప్రదించి సమన్వయం చేసుకో" అని ఎవరికో పెట్టాల్సిన మెసేజ్ ని, అందరికీ కనిపించేలా ట్విట్టర్ లో పెట్టాడు అజయ్ దేవగణ్. అంతే, ఆ ట్వీట్ వైరల్ అయింది. వందల మంది కాజోల్ కు మెసేజ్ చేయడం ప్రారంభించారు.
అజయ్, సదరు ట్వీట్ ను డిలీట్ చేసినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అజయ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయివుండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడగా, పలువురు కాజోల్ ఇంకా స్పందించలేదని అజయ్ కి ఫిర్యాదు చేస్తున్నారు. ఆపై అజయ్ మరో ట్వీట్ లో ఇది 'ప్రాంక్' అని చెప్పినా, ఆ నంబర్ కు వెళుతున్న మెసేజ్ ల సంఖ్య మాత్రం తగ్గలేదు. "సెట్స్‌ లో ప్రాంక్స్‌ చేయడం పాత పద్ధతి. అందుకే కొత్తగా మీతో ప్రాంక్‌ ప్లే చేశాను" అని అజయ్ ట్వీట్ చేయగా, విదేశాల్లో ఉన్న కాజోల్‌ స్పందించింది. "మీరు చేస్తున్న ప్రాంక్స్‌ స్టూడియోను దాటి వెళ్లాయ్‌. కానీ ఇలాంటి వేషాలు ఇంట్లో కుదరవు" అని వార్నింగ్ ఇచ్చింది.