Supreme Court: వెళ్లిపోయేముందు కీలక తీర్పులు ఇవ్వనున్న జస్టిస్ దీపక్ మిశ్రా!

  • వచ్చే నెల 2న పదవీ విరమణ చేయనున్న దీపక్ మిశ్రా
  • దేశ గతిని మార్చగలిగేలా వివిధ తీర్పులు
  • ఆరు రోజుల్లో ఎనిమిది వరకూ తీర్పులు ఇవ్వనున్న సీజేఐ

భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం మరో ఆరు రోజులు మాత్రమే ఉండటంతో ఈ ఆరురోజుల్లో పలు కీలక కేసులపై ఆయన తీర్పులను వెల్లడించనున్నారు. ఇటీవలే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను రద్దు చేసిన ఆయన నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం, వచ్చే నెల 2వ తేదీలోగా దేశ గతిని మార్చగల తీర్పులను ఇవ్వనున్నారు. వాటిల్లో అత్యంత కీలకమైన ఆధార్, అయోధ్య, శబరిమలలో మహిళల ప్రవేశం వంటి కేసులు ఉన్నాయి.

ప్రతి చిన్న పనికీ ఆధార్ అనుసంధానం తప్పని ఈ పరిస్థితుల్లో, ఆధార్ చట్టబద్ధతపైనా, గోప్యతా హక్కులను ఉల్లంఘిస్తోందని, రాజ్యాంగ బద్ధత లేదని... ఇలా దాఖలైన అనేక పిటిషన్లపై గత 40 రోజులుగా ధర్మాసనం ఏకధాటిగా విచారించి, తీర్పును రిజర్వ్ లో ఉంచగా, ఆ తీర్పు నేడో, రేపో వెలువడనుంది.

ఇక దేశంలోనే అత్యంత సమస్యాత్మక కేసుగా ముద్రపడ్డ, అయోధ్య, రామమందిరం విషయంలో సుప్రీం తీర్పు ఎలా ఉంటుందోనన్న ఆసక్తి సర్వత్ర నెలకొంది. ఇక్కడి 2.77 ఎకరాల భూమిని రామ్‌ లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డు, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ముగ్గురు సభ్యుల ధర్మాసనం కేసును విచారిస్తుండగా, అలహాబాద్ హైకోర్టు తీర్పునే సుప్రీం కొనసాగిస్తుందా? లేక ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి రిఫర్ చేస్తుందా? అన్న విషయం వెల్లడి కానుంది.

10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ల మధ్య వయసుండే బాలికలు, మహిళలను శబరిమలలోని అయ్యప్ప ఆలయంలోకి అనుమతించాలా? వద్దా? అనే విషయంపై విచారణ జరిపిన దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం, తీర్పును ఈ వారంలో వెలువరించనుంది. మహిళా సంఘాలు స్త్రీలకు ప్రవేశం కల్పించాలని, సంప్రదాయవాదులు కూడదని వాదిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక దీపక్ మిశ్రా తీర్పు వెలువరించనున్న మరో కీలక కేసు వ్యభిచారం, వివాహేతర సంబంధాల విషయంలో మహిళలను దోషిగా ప్రకటించాలా? వద్దా? అన్న విషయం. ఇప్పటివరకూ మహిళలు పట్టుబడ్డా, వారిని బాధితులుగానే పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఐపీసీ సెక్షన్ 497కు సవరణలు చేసి మహిళలపైనే కేసులు పెట్టేలా చట్ట సవరణకు సుప్రీంకోర్టు అనుమతించవచ్చని తెలుస్తోంది.

వీటితో పాటు ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు, కోర్టులో జడ్జీలు చేపట్టే విచారణల ప్రత్యక్ష ప్రసారాలు, నేర అభియోగాలు మోపబడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా చూడాలా? వద్దా? అన్న కేసు, లాయర్లు రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైతే, కోర్టులకు వెళ్లకుండా చూడాలని దాఖలైన పిటిషన్లపై కూడా ఆయన తీర్పులు ఇవ్వనున్నారు.

More Telugu News