araku: సర్వేశ్వరరావు, సోమ భౌతికకాయాలకు అరకులోనే పోస్టుమార్టం నిర్వహిస్తాం: చినరాజప్ప

  • అంత్యక్రియలు కూడా రేపు అరకులోనే నిర్వహిస్తాం
  • కిడారి, సోమ కుటుంబాలకు అండగా ఉంటాం
  • స్మారక స్థూపం ఏర్పాటు చేస్తాం

మావోయిస్టుల చేతిలో బలైన కిడారి సర్వేశ్వరరావు, సోమ భౌతికకాయాలకు అరకులోనే పోస్టుమార్టం నిర్వహిస్తామని ఏపీ హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. విశాఖపట్టణంలోని సర్క్యూట్ హౌస్ లో ప్రస్తుతం ఏజెన్సీలో పరిస్థితులపై సమీక్షించారు. రేపు అరకులో వారి అంత్యక్రియలు కూడా నిర్వహిస్తామని అన్నారు. మావోయిస్టుల ఘాతుకానికి బలైపోయిన కిడారి, సోమ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారి కుటుంబసభ్యులతో మాట్లాడి స్మారక స్థూపం ఏర్పాటు చేస్తామని చెెప్పారు.

ఈ ఘటన నేపథ్యంలో ప్రజలు సంయమనం పాటించాలని, పోలీసుల వైఫల్యం అనడంలో అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు వారు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ సమీక్షలో మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, పితాని సత్యనారాయణ, డీఐజీ శ్రీకాంత్, విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా తదితరులు పాల్గొన్నారు. కాగా, సర్వేశ్వరరావు, సోమ భౌతికకాయాలను అరకులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలించారు.

More Telugu News