rains: వర్షాలు పడాలంటే టైర్లు, ఉప్పు కలిపి కాల్చండి.. విచిత్రమైన ఉత్తర్వులు జారీచేసిన కలెక్టర్!

  • పాటించిన జిల్లా యంత్రాంగం
  • తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన పర్యావరణ వేత్తలు
  • వివరణ ఇచ్చిన కలెక్టర్ రాజేంద్ర

సాధారణంగా వర్షాలు పడాలంటే ఏం చేస్తారు? పల్లెల్లో అయితే కప్పలకు, కుక్కలకు పెళ్లిళ్లు చేస్తారు. మరికొన్ని చోట్ల యాగాలు, హోమాలు చేస్తారు. ప్రభుత్వాలు అయితే మేఘమధనం పేరిట మబ్బులపై రసాయనాలను విమానాలతో చల్లి వర్షాలు కురిసేలా చేస్తాయి. కానీ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లా కలెక్టర్ మాత్రం వర్షాలు కురిసేందుకు సరికొత్త పద్ధతిని కనిబెట్టారు. కార్లు, బస్సుల టైర్లు, ఉప్పును ఒకేసారి కాల్చడం ద్వారా వర్షాలు పడతాయని ఆయన నమ్మారు. నమ్మడమే కాదు.. దాన్ని ఆచరణలో పెట్టాలని జిల్లాలో అధికారులందరికీ ఆదేశాలు జారీచేశారు.

సోలాపూర్ కలెక్టర్ రాజేంద్ర భోసలే ఈ మేరకు శుక్రవారం మౌఖిక ఉత్తర్వులను జారీచేశారు. దీంతో జిల్లాలోని అధికారులందరూ 11 మండలాల్లో 1,026 చోట్ల టైర్లు, ఉప్పును కలిపి కాల్చడం మొదలుపెట్టారు. ఈ విషయం ఆ నోటా, ఈ నోటా మీడియాకు చేరడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో పర్యావరణ వేత్తలు, శాస్త్రవేత్తలు స్పందిస్తూ.. రబ్బరు టైర్లను, ఉప్పును కలిపి కాల్చడం కారణంగా వర్షాలు రావనీ, ఇది అశాస్త్రీయమైన నమ్మకమని కొట్టిపడేశారు. టైర్లను కాలిస్తే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ వంటి విషపూరిత వాయువులు గాల్లోకి విడుదల అవుతాయన్నారు. కలెక్టర్ ఆదేశాలపై నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో తన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు రాజేంద్ర ప్రకటించారు.

దీనిపై కలెక్టర్ వివరణ ఇస్తూ.. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి రాజా మరాఠే దీన్ని ప్రతిపాదించారని తెలిపారు. ఇలా రెండు టైర్లు, కొన్ని కట్టెలు, 50 కేజీల ఉప్పును కలిపి కాల్చడం కారణంగా ఉప్పు నీటి ఆవిరిగా మారి గాల్లో కలిసిపోయి 24-96 గంటల వ్యవధిలో వర్షాలు సంభవిస్తాయని మరాఠే తనకు చెప్పారన్నారు. ఈసారి జిల్లాలో కేవలం 35 శాతం వర్షపాతం మాత్రమే నమోదయిందనీ, ఈ నేపథ్యంలోనే కృత్రిమ వర్షపాతం కోసం ఈ విధానాన్ని పాటించామన్నారు. అయితే పర్యావరణవేత్తలు దీని కారణంగా జరిగే నష్టాన్ని వివరించడంతో ఈ ప్రయోగాన్ని ఆపేశామని రాజేంద్ర వెల్లడించారు. మరోవైపు రాజా మరాఠే తన వాదనకు కట్టుబడ్డారు. రెండు టైర్లు, కట్టెలు, 50 కేజీల ఉప్పును మండిస్తే 5 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3-4 మీమీ వర్షం కురుస్తుందని తెలిపారు. 500 ట్యాంకర్లలో పట్టే ఈ నీటిని బయట కొనాలంటే రూ.5 లక్షలు ఖర్చవుతుందనీ, కానీ తన విధానంలో ఖర్చు రూ.500కు మించదని వ్యాఖ్యానించారు.

More Telugu News