Madhya Pradesh: ఆధునిక 'షోలే'... చంబల్ లోయలో డెకాయిట్లపై దాడి చేసి చంపేసిన ప్రజలు!

  • అందినకాడికి దోచుకుపోతున్న దోపిడీ దొంగలు
  • అడిగిన డబ్బులు ఇవ్వలేదని తుపాకులతో కాల్పులు
  • ప్రతిగా దాడికి దిగిన గ్రామస్తులు

తమ గ్రామంపై పడి, అందినకాడికి దోచుకుపోతున్న దోపిడీ దొంగలపై దాడి చేసిన గ్రామస్తులు, ఒకరిని చంపారు. మధ్యప్రదేశ్ లోని చంబల్ లోయలో జరిగిన ఈ ఘటన మరో 'షోలే'ను గుర్తు చేసింది. మోరేనా జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్నా మన్పూర్ గ్రామంలో ప్రజలను దోచుకునే ప్రయత్నాన్ని దుండగులు చేసిన వేళ, ఈ ఘటన జరిగింది. మొత్తం ఏడుగురు డెకాయిట్లు వచ్చారని, వారిలో ఐదుగురు తుపాకులతో ఉన్నారని పోలీసులకు గ్రామస్తులు వెల్లడించారు.

గత వారంలో వారు వచ్చి రూ. 50 వేలను, నెయ్యిని ఇవ్వాలని డిమాండ్ చేసి వెళ్లారని, గత రాత్రి వచ్చి తాము అడిగిన డబ్బు కోసం డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బు ఇవ్వలేమని చెప్పడంతో వారు తుపాకులతో కాల్పులు ప్రారంభించారని, ప్రతిగా, గ్రామస్తులు కూడా కాల్చారని వెల్లడించారు. దొంగలందరూ పారిపోయారని భావించామని, తెల్లారిన తరువాత ఓ దొంగ మృతదేహం లభ్యమైందని, అతను ఎవరన్న విషయాన్ని గుర్తించాల్సి వుందని ప్రజలు తెలిపారు. కాగా, గ్రామంపై దాడికి యత్నించిన వారు పరారీలో ఉన్న నేరస్తులేనని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఉండటంతో దొంగలు సులువుగా తప్పించుకునేందుకు వీలు కలుగుతోందని అధికారులు తెలిపారు.

More Telugu News