Rahul Gandhi: రాహుల్ గాంధీ సంచలన నిర్ణయం... కాంగ్రెస్ ఎంపీల మూకుమ్మడి రాజీనామాలు!

  • బీజేపీకి సాధ్యమైనంత ఎక్కువ నష్టాన్ని కలిగించాలని భావిస్తున్న రాహుల్
  • ఫ్రాంకోయిస్ హోలాండ్ వ్యాఖ్యలే అస్త్రం
  • విపక్షాలతో చర్చిస్తున్న కాంగ్రెస్

రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో తమ చేతికి వచ్చిన అస్త్రాన్ని వినియోగించుకుని, అధికార బీజేపీకి సాధ్యమైనంత ఎక్కువ నష్టాన్ని కలిగించాలని భావిస్తున్న రాహుల్, సంచలన నిర్ణయం తీసుకోనున్నారు. రాఫెల్ డీల్ ను అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ డిఫెన్స్ కు కట్టబెట్టాలని, మోదీ సర్కారు సిఫార్సు చేసినట్టు ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు చెప్పాడంటూ వచ్చిన వార్తలు, తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపగా, కాంగ్రెస్ ఎంపీలతో మూకుమ్మడి రాజీనామాలు చేయించాలని రాహుల్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర విపక్ష పార్టీలను ఒప్పించి, అందరితో రిజైన్ చేయించడం ద్వారా నరేంద్ర మోదీని ముప్పుతిప్పలు పెట్టేందుకు ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.

గతంలో బోఫోర్సు కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు, నాటి విపక్షాలు రాజీనామాస్త్రాన్ని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాహుల్ కూడా అదే అస్త్రాన్ని వదలాలని అనుకుంటున్నారట. రాఫెల్ డీల్ వెనుక అవకతవకలపై జేపీసీ (జాయింట్ పార్లమెంటరీ కమిటీ)ని ఏర్పాటు చేయాలని, అలా చేయకుంటే మూకుమ్మడి రాజీనామాలు చేయాలని ఆలోచిస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్ చేసిన తాజా ప్రకటన కాంగ్రెస్ కు ఓ వజ్రాయుధంగా మారినట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

More Telugu News