TTD: శ్రీవారి సేవా టికెట్ల కుంభకోణం.. స్కెచ్ వేసిన కర్ణాటక మాజీ ఐఏఎస్ కుమారుడు!

  • 2,600 సేవా టికెట్లు దక్కించుకున్న ముఠా
  • అరెస్ట్ చేసేందుకు బయలుదేరిన పోలీసులు
  • నకిలీ ఆధార్, ఓటర్ కార్డులతో టికెట్లు దక్కించుకున్న వైనం

తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో సేవా టికెట్ల కుంభకోణం మరో మలుపు తిరిగింది. దాదాపు 2,600 శ్రీవారి సేవా టికెట్లను అక్రమంగా దక్కించుకున్న ఈ ఘటనలో పెద్దల పాత్ర ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణంలో సాక్షాత్తూ కర్ణాటకకు చెందిన మాజీ ఐఏఎస్ కుమారుడి పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతనితో పాటు మిగిలిన ముఠా సభ్యులను పట్టుకునేందుకు పోలీసుల ప్రత్యేక బృందం కర్ణాటకకు బయలుదేరింది.

ఆన్ లైన్ లో సేవా టికెట్లను అక్రమంగా దక్కించుకున్న కొందరు దళారులు, ఓ ఉద్యోగిని విజిలెన్స్ అధికారులు, పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరిని విచారించగా ఇదే తరహాలో కర్ణాటకలోని మరో ముఠా కూడా 2,600 సేవా టికెట్లు దక్కించుకున్నట్లు తేలింది. నకిలీ ఆధార్, ఓటర్ కార్డులను తయారుచేసిన ఈ ముఠా.. అక్రమంగా ఆన్ లైన్ ద్వారా శ్రీవారి సేవా టికెట్లను పొందింది.

దాన్ని అధిక ధరలకు భక్తులకు అమ్ముకుంటూ ఈ ముఠా సభ్యులు సొమ్ము చేసుకున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా కూపీ లాగగా, కర్ణాటకకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడు ఈ ముఠాలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో ఈ ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసుల టీమ్ కర్ణాటకకు ఈ రోజు బయలుదేరింది.

More Telugu News