Rafale jets: చిక్కుల్లో మోదీ సర్కారు... రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌ను ఎంపిక చేసింది మోదీ ప్రభుత్వమేనన్న ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు!

  • రాఫెల్ డీల్‌ను విమర్శించిన ప్రతిసారీ రాహుల్‌పై విరుచుకుపడిన బీజేపీ
  • హోలన్ ప్రకటనతో అడ్డంగా దొరికిన మోదీ ప్రభుత్వం
  • అదే నిజమైతే చాలా తీవ్రమైన అంశం అవుతుందన్న సుబ్రహ్మణ్యస్వామి

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే పలు విమర్శలు ఎదుర్కొంటున్న మోదీ సర్కారు ఈసారి తీవ్ర చిక్కుల్లో పడింది. రాఫెల్ డీల్‌లో తమ ప్రమేయం ఏమీ లేదని, విమానాలను తయారుచేసే డసో ఏవియేషన్ సంస్థే రిలయన్స్‌ను భాగస్వామిగా ఎంచుకుందని తొలి నుంచి ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే, అదంతా అబద్ధమని తేలింది. రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంచుకోవాలని స్వయంగా మోదీ ప్రభుత్వమే సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాన్స్‌వో హోలన్ తెలిపారు. రిలయన్స్‌తో డీల్‌పై తొలి నుంచి విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌కు ఇప్పుడు పెద్ద ఆయుధం దొరికినట్టు అయింది.

రాఫెల్ డీల్‌లో రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చడంపై కాంగ్రెస్ మొదటి నుంచి విమర్శలు గుప్పిస్తోంది. ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ను కాదని రిలయన్స్‌కు అప్పగించడం వెనక భారీ ‘డీల్’ కుదిరిందని ఆరోపించింది. అయితే, కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ ఖండించింది. కానీ ఇప్పుడు స్వయంగా ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడే చెప్పడంతో బీజేపీ చిక్కుల్లో పడింది.

నిజానికి రిలయన్స్ డిఫెన్స్‌ను భాగస్వామిగా చేర్చుకునే విషయంలో తమ ప్రమేయం ఏమీ లేదని, భారత ప్రభుత్వమే ఆ గ్రూపు పేరును ప్రతిపాదించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు  ఫ్రాన్స్‌వో హోలన్ తెలిపారు. ప్రభుత్వ సూచన మేరకే అనిల్ అంబానీ గ్రూపుతో డసో సంప్రదింపులు జరిపినట్టు సూచించింది. ఈ వ్యవహారంలో తమకు మరో అవకాశం లేకుండా పోయిందన్నారు. కాగా, ఈ వార్తలపై బీజేపీ ఇప్పటి వరకు స్పందించలేదు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాత్రం ఈ వార్తలపై స్పందిస్తూ.. ఒకవేళ అదే జరిగి ఉంటే.. చాలా తీవ్రమైన అంశం అవుతుందని వ్యాఖ్యానించారు. రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ఆ వార్తలోని నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఇది వాణిజ్యపరమైన నిర్ణయమని, ఇందులో కేంద్రానికి గానీ, ఫ్రాన్స్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.

More Telugu News