Telangana: 15 మంది అభ్యర్థులను మార్చే ఆలోచనలో కేసీఆర్?

  • ఎన్నికల షెడ్యూల్ రాకుండానే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
  • పార్టీ అభ్యర్థుల ప్రచారంపై నిఘా
  • పుంజుకోని వారి తొలగింపు తథ్యం!

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు షెడ్యూల్ కూడా రాకుండానే 105 మంది అభ్యర్థులను ప్రకటించి, విపక్షాలకు షాక్ ఇచ్చిన కేసీఆర్, ఇప్పుడు తన పార్టీ అభ్యర్థులు చేస్తున్న ప్రచారంపై నిఘా పెట్టారని తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తున్న ఆయన, ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే నాటికి ప్రచారంలో దూసుకెళ్లని అభ్యర్థులను మార్చాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రచారంలో వెనుకబడిన వారిని మారుస్తానని, ఈ విషయంలో ఏ మాత్రం సందేహం లేదని ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు కూడా.

ప్రస్తుతం ప్రచారం విషయంలో కనీసం 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు అనుకున్నంత తృప్తిగా అడుగులు వేయడం లేదని భావిస్తున్న కేసీఆర్, ఇప్పుడే వారి పేర్లను బయటపెట్టి, మారిస్తే, వారు ఇతర పార్టీల్లోకి ప్లేటు ఫిరాయిస్తారని భావిస్తున్నారని తెలుస్తోంది. అందువల్లే ఆయన వేచి చూసే ధోరణిలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. నియోజకవర్గాల వారీగా ప్రచార సరళి, స్థానిక రాజకీయ స్థితిగతులను నిత్యమూ అధ్యయనం చేస్తున్న కేసీఆర్, కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు ప్రత్యేకంగా వేగులను పంపి సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్టు తెలుస్తోంది.

టికెట్ ఇచ్చి, ప్రచారానికి సమయం ఇచ్చి, అధిష్ఠానం స్థాయిలో సహకరించినా కూడా, పుంజుకోలేని అభ్యర్థుల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఇక పలువురు తాజా మాజీ ఎమ్మెల్యేలు తమ గురించి గులాబీ బాస్ ఏమని అనుకుంటున్నారో తెలుసుకునేందుకు మంత్రులను ఆశ్రయిస్తున్నారు.

More Telugu News