Jayalalitha: జయలలిత మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు.. మొన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశామన్న అపోలో.. నేడు 30 రోజుల ఫుటేజీ మాత్రమే ఉందన్న ఆసుపత్రి!

  • జయలలిత మృతి కేసులో బలపడుతున్న అనుమానాలు
  • ఆసుపత్రి సీసీ టీవీ ఫుటేజీ కావాలన్న ఏకసభ్య కమిషన్
  • ఇవ్వలేమన్న అపోలో ఆసుపత్రి యాజమాన్యం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి విషయంలో అనుమానాలు రోజురోజుకు మరింత బలపడుతున్నాయి. ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ ముందు ఒక్కొక్కరు ఒక్కోలా పొంతనలేని సమాధానాలతో అనుమానాలు పెంచగా, తాజాగా జయ చికిత్స పొందుతున్నప్పటి సీసీ టీవీ ఫుటేజీలు ఇవ్వలేమని అపోలో ఆసుపత్రి తేల్చి చెప్పింది. దీంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పటి సీసీ టీవీ ఫుటేజీలను ఇవ్వలేమని అపోలో ఆసుపత్రి యాజమాన్యం జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్‌కు చెప్పింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటి సీసీటీవీ ఫుటేజీ తమకు కావాలంటూ ఏకసభ్య కమిషన్ అపోలోను కోరింది. దీనికి అపోలో బదులిస్తూ తమ సర్వర్‌లో 30 రోజులకు సంబంధించిన వీడియో మాత్రమే రికార్డు అయిందని, అయినా, దానిని ఇవ్వలేమని ఆసుపత్రి  కౌన్సెలర్ మైనూనా బాద్షా తెలిపారు. వీడియో ఫుటేజీని ఇవ్వలేమన్న సమాధానాన్ని లిఖితపూర్వకంగా ఇచ్చినట్టు తెలిపారు.

కాగా, ఈ నెల మొదట్లో ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ అధికారి సుబ్బయ్య విశ్వనాథ్ మాట్లాడుతూ.. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ప్రభుత్వ అధికారి ఆదేశాల ప్రకారం ఆసుపత్రిలోని సీసీ టీవీ కెమెరాలను ఆఫ్ చేసినట్టు చెప్పడం గమనార్హం. ఇప్పుడేమో నెల రోజుల వీడియో మాత్రమే ఉందని, అది కూడా ఇవ్వలేమని చెప్పడంతో జయలలిత మృతిపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

More Telugu News