asia cup: విరుచుకుపడ్డ టీమిండియా బౌలర్లు.. కుప్పకూలిన పాకిస్థాన్

  • 162 పరుగులకు పాకిస్థాన్ ఆలౌట్
  • బాబర్, షోయబ్ మినహా రాణించని పాక్ బ్యాట్స్ మెన్
  • చెరో మూడు వికెట్లు పడగొట్టిన భువీ, జాదవ్

ఆసియా కప్ లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో దాయాది పాకిస్థాన్ పై టీమిండియా బౌలర్లు విశ్వరూపం ప్రదర్శించారు. మన బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్ మెన్ పూర్తిగా బ్యాట్లు ఎత్తేశారు. 43.1 ఓవర్లలో కేవలం 162 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్ అయింది. బాబర్ ఆజం (47), హైదరాబాద్ అల్లుడు షోయబ్ మాలిక్ (43) మినహా మరెవరూ క్రీజులో నిలవలేక పోయారు. పెవిలియన్ కు వరుసకట్టారు. స్కోరు బోర్డుపైకి 3 పరుగులు చేరకుండానే భువనేశ్వర్ కుమార్ పాక్ ఓపెనర్లు ఇమాం ఉల్ హక్ (2), ఫక్తర్ జమాన్ (డకౌట్)లను పెవిలియన్ చేర్చాడు.

అనంతరం బరిలోకి దిగిన బాబర్ , షోయబ్ లు సమయోచితంగా ఆడుతూ 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తరుణంలో జట్టు స్కోరు 85 పరుగులు ఉన్నప్పుడు బాబర్ ను కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయడంతో... పాక్ పతనం ప్రారంభమైంది. ఆ వెంటనే 96 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ రనౌట్ (అంబటి రాయుడు) అయ్యాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ (6), ఆసిఫ్ అలీ (9), షాదాబ్ ఖాన్ (8), ఫహీమ్ అష్రఫ్ (21), హసన్ అలీ (1), ఉస్మాన్ ఖాన్ (డకౌట్)లు వచ్చినవాళ్లు వచ్చినట్టుగా పెవిలియన్ చేరారు. 18 పరుగులతో మొహమ్మద్ ఆమిర్ నాటౌట్ గా నిలిచాడు.

భారత బౌలర్లలో భువనేశ్వర్, జాదవ్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టారు. బుమ్రా 2 వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడు. ధోనీ రెండు క్యాచ్ లు పట్టడమే కాకుండా, ఒక స్టంపింగ్ చేయడం విశేషం. 163 పరుగుల స్వల్ప విజయలక్ష్యంతో టీమిండియా కాసేపట్లో బ్యాటింగ్ కు దిగనుంది. 

More Telugu News