Chandrababu: ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు, విష్ణుకుమార్ రాజుల మధ్య సంవాదం!

  • చంద్రబాబు ఏ విషయాన్నైనా గుండెల్లోకి వెళ్లేలా చెబుతారన్న విష్ణు
  • తాము అసత్యాలు చెప్పడం లేదన్న చంద్రబాబు
  • తీర్మానానికి ఆమోదం తెలుపుతున్నామన్న విష్ణు

ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలంటూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ ప్రజల హక్కుల కోసమే తాము పోరాడుతున్నామని, ఈ పోరాటాన్ని ఈ గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ స్వాగతించాలని కోరారు. ఏపీలోని బీజేపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించాలని అన్నారు. ఆంధ్రుడు అనుకునే ప్రతి వ్యక్తి కేంద్రం వైఖరిపై బొబ్బిలి పులిలా తిరగబడాలని పిలుపునిచ్చారు.

అనంతరం బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విషయాన్నైనా చాలా స్పష్టంగా చెబుతారని, గుండెల్లోకి వెళ్లేలా చెబుతారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జోక్యం చేసుకుని... తాను చెప్పిన దాంట్లో ఏమాత్రం అసత్యం లేదని... చట్టంలో పేర్కొన్న వాటిలో 90 శాతం చేసేశామని బీజేపీ నేతలు అంటుండటం దారుణమని అన్నారు. కేంద్ర వైఖరితో పుట్టబోయే బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్ర వైఖరిని నిరసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని కోరారు.

అనంతరం విష్ణు మాట్లాడుతూ, తాను కూడా ఆంధ్రుడనేనని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేనని చెప్పారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచారు. ముఖ్యమంత్రి చెప్పిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని తాము అనడం లేదని... ఆయన చెప్పిన విషయాలను అర్థం చేసుకున్నామని చెప్పారు. తీర్మానంలో ఏపీకి అన్యాయం జరిగినట్టు ఉంటే, మౌనం వహిస్తూ, తాము కూడా ఆమోదం తెలుపుతున్నామని అన్నారు. 

More Telugu News