Nellore District: నేనూ అమృతలా అయిపోతానేమో... కులాంతర వివాహం చేసుకున్న శివదీప్తి రెడ్డి!

  • విజయ్ కుమార్ ను చర్చ్ లో వివాహమాడిన శివదీప్తి రెడ్డి
  • ఆగ్రహంతో బెదిరింపులకు దిగిన శివదీప్తి తల్లిదండ్రులు
  • కాపాడాలని మీడియా ముందు వాపోయిన దంపతులు
ప్రణయ్, అమృత వర్షిణి మాదిరిగానే కులాంతర వివాహం చేసుకున్న ఓ జంట, ఇప్పుడు తమకు ప్రాణహాని ఉందని మీడియాను ఆశ్రయించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సత్యం రెడ్డి, పద్మావతి దంపతుల కుమార్తె శివదీప్తి రెడ్డి అనే యువతి, కడప ప్రాంతంలో లాండ్రీ నడుపుకుంటున్న విజయ్ కుమార్ తో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉంది. ఈ జంట జూలై 26న కడపలోని ఓ చర్చిలో వివాహం చేసుకున్నారు. తమ కూతురు పరువు తీసిందన్న ఆగ్రహంతో ఉన్న శివదీప్తి తల్లిదండ్రులు, కొంతకాలంగా దీప్తిని బెదిరిస్తున్నారట.

తన బంధువులు చరణ్ రెడ్డి, రవీందర్ రెడ్డి పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో ఉన్నారని, వారంతా తమను వేధిస్తున్నారని ఆమె మీడియా ముందు కన్నీటితో వాపోయింది. వాళ్ల సాయంతో తాము ఎక్కడ ఉంటున్నామన్న విషయాన్ని సెల్ ఫోన్ల ద్వారా ట్రేస్ చేస్తున్నారని ఆరోపించింది. రౌడీ షీటర్లకు డబ్బులిచ్చి తమను చంపాలని చెప్పినట్టుగా అనుమానం ఉందని చెప్పింది. తమకు ఎప్పుడు అపాయం ముంచుకొస్తుందో అన్న భయం వేస్తోందని, అందుకే మీడియా ముందుకు వచ్చామని ఆమె పేర్కొంది. కట్టుబాట్లను దాటి ఒకటైన తాము ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోజు గడపాల్సి వస్తోందని శివదీప్తి చెప్పింది. తాను కూడా అమృతలా ఒంటరిని అయిపోతానన్న భయం నెలకొనివుందని శివదీప్తి వాపోయింది. 

Nellore District
Gudur
Love Marriage
Sivadeepti Reddy
Inter Caste Marriage

More Telugu News