East Godavari District: గోదావరి తొక్కిసలాటకు మీడియా ప్రచారమే కారణం.. సంచలన విషయం బయటపెట్టిన కమిషన్!

  • పుష్కర ముహూర్తంపై మీడియాలో విస్తృత ప్రచారం
  • ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించారు
  • 17 పేజీల నివేదిక ను అసెంబ్లీలో పెట్టిన ప్రభుత్వం
గోదావరి పుష్కరాల సందర్భంగా దాదాపు 36 మంది దుర్మరణం చెందిన ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని తేలింది. ఈ దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అసెంబ్లీ చివరిరోజు సమావేశాల సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఈ నివేదికను శాసనసభ ముందు ఉంచింది.

కమిషన్ సమర్పించిన 17 పేజీల నివేదికలో.. అతి ప్రచారం కారణంగానే రాజమండ్రిలోని కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుందని తెలిపింది. పుష్కర సమయంపై మీడియాలో జరిగిన విస్తృత ప్రచారం కారణంగానే భక్తులు ఒక్కసారిగా ఘాట్ వద్దకు పోటెత్తారనీ, దీంతో తొక్కిసలాట జరిగిందని వెల్లడించింది. పత్రికలు, టీవీ ఛానెళ్లు ప్రజల్లో గుడ్డి నమ్మకాన్ని కలిగించడంతో పాటు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించాయని పేర్కొంది.

2015, జూలై 14న ఉదయం 6.29 గంటలకు పుష్కర ముహూర్తాన్ని పూజారులు నిర్ణయించినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని కమిషన్ తెలిపింది. దీంతో ఈ ముహూర్తానికే పుణ్య స్నానాలు ఆచరించేందుకు ప్రజలు ఘాట్ల వద్దకు పోటెత్తారని వెల్లడించింది. ముఖ్యమంత్రి పుణ్య స్నానాలు ఆచరించాక ఒక్కసారిగా ప్రజలు దూసుకొచ్చారని పేర్కొంది. ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఇచ్చిన నివేదికను కమిషన్ తన రిపోర్టుకు జతచేసింది. ఈ పుష్కరాల నిర్వహణకు రూ.1,500 కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
East Godavari District
Rajamundry
pushkaralu
36 dead
Chandrababu
ap assembly
report

More Telugu News