Anantapur District: ఒక్క రాంగ్ కాల్.. వివాహేతర బంధంకు, గృహిణి హత్యకు దారితీసింది!

  • అనంతపురం జిల్లాలో వివాహిత హత్య
  • కేసును ఛేదించిన పోలీసులు
  • కీలక సాక్ష్యాలు అందించిన మృతురాలి ఫోన్

అనంతపురం జిల్లా కూడేరు మండలం శివరాంపేటలో ఈ నెల మొదటి వారంలో జరిగిన వివాహిత విజయలక్ష్మి హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రుద్రేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. అనుకోకుండా వెళ్లిన ఓ రాంగ్ కాల్ విజయలక్ష్మి ప్రాణాలను తీసిందని సీఐ ప్రసాద్ రావు మీడియాకు వెల్లడించారు.

పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ, విద్యార్థులకు ట్యూషన్ చెప్పే రుద్రేష్ కు గత నెల 2వ తేదీన అనంతపురంకు చెందిన వివాహిత విజయలక్ష్మి నుంచి ఓ రాంగ్ కాల్ వచ్చింది. ఆ పరిచయం వాట్సాప్ మెసేజ్ ల నుంచి ఒకరిని ఒకరు కలుసుకునేంత వరకూ వెళ్లింది. ఆపై నెల రోజుల వ్యవధిలోనే వారి పరిచయం వివాహేతర బంధంగా మారిందని, తనకు భార్య ఉందన్న విషయాన్ని రుద్రేష్, తనకు భర్త ఉన్నాడన్న విషయాన్ని విజయలక్ష్మి మరచిపోయారు.

అయితే, రాత్రుళ్లు ఫోన్ లో గంటల తరబడి తన భర్త మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన రుద్రేష్ భార్య నిలదీయడం, మరోవైపు తన భర్తను వదిలేసి వస్తానని చెబుతున్న విజయలక్ష్మి, తనను పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేస్తుండటంతో రుద్రేష్ లో విసుగు పెరిగింది. ఇక విజయలక్ష్మిని వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 5న ఆమెను బయటకు తీసుకెళ్లి, సరదాగా ఉన్నట్టు నటించి, శివరాంపేట గుట్టల్లోకి తీసుకెళ్లి, మెడకు చున్నీ బిగించి, బండరాయితో మోది, ఆమె నగలు తీసుకుని పారిపోయాడు. తర్వాత వాటిని తాకట్టుపెట్టి తన ఊరికి వెళ్లిపోయాడు.

విజయలక్ష్మి ఫోన్ కాల్స్ వివరాల ఆధారంగా రుద్రేష్ ను అరెస్ట్ చేసి ప్రశ్నించగా, మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. ఈ కేసులో మృతురాలి ఫోన్ కీలక ఆధారాలు అందించిందని, రుద్రేష్ ను రిమాండ్ కు పంపామని, కేసును మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

More Telugu News