Nalgonda District: అతి ప్రేమ, తన బిడ్డ తనకు కావాలన్న కోరికతోనే ప్రణయ్ హత్యకు ఇంత భారీ కుట్ర జరిగింది!: నల్గొండ ఎస్పీ రంగనాథ్

  • మారుతీరావు ధనవంతుడు కావడంతో భారీ మొత్తం డిమాండ్
  • మూడు రోజుల్లోనే కేసును ఛేదించాం
  • వేముల వీరేశం పాత్రపై అమృత ఫిర్యాదు చేస్తే విచారిస్తామన్న రంగనాథ్
కంటికిరెప్పలా చూసుకుంటూ పెంచుకున్న బిడ్డ, తనను కాదని మరో యువకుడితో వెళ్లిపోయిన నేపథ్యంలో, బిడ్డపై ఉన్న అతి ప్రేమ, ఆమె తనకు కావాలన్న బలమైన కోరికతోనే అమృత వర్షిణి భర్త ప్రణయ్ ను హత్య చేయించాలని మారుతీరావు భారీ కుట్రకు పాల్పడ్డాడని నల్గొండ జిల్లా ఎస్పీ రంగనాథ్ వ్యాఖ్యానించారు. ఈ కేసులో ఏ1 నిందితుడు మారుతీరావేనని, మరో ఆరుగురు నిందితులు ఉన్నారని, వారిని నేడు మీడియా ముందు హాజరు పరుస్తామని చెప్పారు. హత్య చేస్తే రూ. కోటి రూపాయలు ఇచ్చేలా డీల్ మాట్లాడుకున్న మారుతీరావు, అడ్వాన్సుగా రూ. 18 లక్షలు ఇచ్చాడని తెలిపారు. ప్రణయ్ పై కత్తితో దాడి చేసిన వ్యక్తిని బీహార్ వాసిగా గుర్తించామని అన్నారు.

అవతలి వ్యక్తి ధనవంతుడు కావడం వల్లే, హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేసిందని, అందుకు మారుతీరావు కూడా అంగీకరించాడని రంగనాథ్ తెలిపారు. ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని, స్క్రీన్ మీద కనిపిస్తున్న పాత్రధారి ఒకరేనని, దీని వెనుక చాలా మంది ఉన్నారని అన్నారు. ఈ కేసులో అమృత వర్షిణి ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం, నయీమ్ గ్యాంగ్ ల ప్రమేయంపై, విచారణ జరిపిస్తామని, ఈ కేసులో అమృత స్టేట్ మెంట్ తీసుకోవాల్సి వుందని అన్నారు.

వేముల వీరేశం గత జనవరిలో అమృత మామ బాలస్వామిని బెదిరించినట్టు తమ వద్ద ఫిర్యాదు ఉందని, అందువల్లే అమృత అతనిపై ఆరోపించి వుండవచ్చని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఆమె ఫిర్యాదు చేస్తే, కేసు రిజిస్టర్ చేసి, వీరేశాన్ని విచారిస్తామని, ఈ మూడు రోజుల విచారణలో మాత్రం అతని ప్రమేయంపై ఆధారాలు లభ్యం కాలేదని అన్నారు.
Nalgonda District
Miryalaguda
Ranganath
Honor Killing
Pranay
Amrutha

More Telugu News