Konda Surekha: కొండా దంపతుల విషయంలో స్వయంగా రంగంలోకి దిగిన కేసీఆర్?

  • కొండా దంపతులను టీఆర్ఎస్ లోనే కొనసాగించేందుకు యత్నం
  • వారితో చర్చించేందుకు అంగీకరించిన కేసీఆర్
  • నవరాత్రులు ముగిశాక భేటీ అయ్యే అవకాశం

టీఆర్ఎస్ తొలి జాబితాలో తమ పేరు లేకపోవడంతో కొండా దంపతులు సురేఖ, మురళిలు పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమ టికెట్ ను పెండింగ్ లో పెట్టడానికి గల కారణాలను రెండు రోజుల్లోగా చెప్పాలని... లేకపోతే బహిరంగ లేఖ రాసి, టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతామని వారు ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఇదే సమయంలో మరోవైపు, కాంగ్రెస్ లో చేరే విషయంపై కూడా వారు యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారిని టీఆర్ఎస్ లోనే కొనసాగించేలా... పార్టీ అధిష్ఠానం వేగంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. వారికి జరిగిన అవమానాన్ని సరిదిద్దేందుకు స్వయంగా కేసీఆరే రంగలోకి దిగినట్టు తెలుస్తోంది.

కొండా దంపతులతో చర్చించేందుకు కేసీఆర్ అంగీకరించారని విశ్వసనీయ సమాచారం. అయితే, ప్రస్తుతం కొనసాగుతున్న గణపతి నవరాత్రులను కొండా దంపతులు కీడు దినాలుగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులు వారు గుమ్మం దాటి బయటకు రారు. ఎలాంటి కార్యక్రమాలకు కూడా హాజరుకారు. దీంతో, నవరాత్రులు ముగిసిన అనంతరం కేసీఆర్ తో వారు భేటీ అయ్యే అవకాశం ఉంది.

More Telugu News