Revanth Reddy: నా అరెస్టుకు కుట్ర పన్నుతున్నారు.. అయినా కేసీఆర్‌ను వదిలేదే లేదు!: రేవంత్

  • కేంద్రంతో కలిసి టీఆర్ఎస్ కుట్రలు పన్నుతోంది
  • నాపై, నా బంధువులపై నిఘా పెట్టారు
  • ఓటుకు నోటు కేసు తప్పుడుదని హైకోర్టు చెప్పింది

తనపైకి ఈడీని పంపినా.. 100 అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్‌ను వదిలేదే లేదని.. మిత్తీ (వడ్డీ)తో సహా లెక్క చెల్లిస్తామని కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను ఇబ్బందిపెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని తనపై ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ కమిటీల్లో తనకు కీలక బాధ్యత అప్పగిస్తే తమకు ఇబ్బందవుతుందని గ్రహించిన కేసీఆర్.. కేంద్రంతో కలిసి ముందుగానే తన అరెస్ట్‌కు కుట్ర పన్నుతున్నారని రేవంత్ ఆరోపించారు. దీనిలో భాగంగానే తన చుట్టూ.. తన బంధువుల చుట్టూ నిఘా పెట్టారని తెలిపారు.

తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే... దానికి ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్ లే బాధ్యులని రేవంత్ అన్నారు. తనపై పెట్టిన ఓటుకు నోటు కేసు కూడా తప్పుడుదేనని రాష్ట్ర హైకోర్టు చెప్పిందని తెలిపారు. టెలిఫోన్ సంభాషణలో కూడా ఎలాంటి తప్పు లేదని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై అక్రమ కేసులు పెడుతోందని.. దీనికి భారీ మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు.

More Telugu News