babli: వారెంట్ పై చర్చిస్తున్నాం.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం!: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన

  • వారెంట్ పంపింది కాక.. డ్రామాలాడుతున్నారంటూ మమ్మల్నే విమర్శిస్తారా?
  • ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే పోరాటం చేశా
  • తెలుగు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటా

అసెంబ్లీలో బాబ్లీ ప్రాజెక్టు కేసు, అరెస్ట్ వారెంట్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ప్రస్తుతం కేంద్రంలో, మహారాష్ట్రలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. అరెస్ట్ వారెంట్ పంపింది కాక, డ్రామాలాడుతున్నారంటూ తిరిగి మమ్మల్నే విమర్శిస్తారా? అంటూ మండిపడ్డారు. ధర్మాబాద్ కోర్టు ఇచ్చిన వారెంట్ పై చర్చిస్తున్నామని... ఏం చేయాలి? అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతోందని 2010లో తాము బాబ్లీ నిరసన చేపట్టామని చంద్రబాబు తెలిపారు. ఉత్తర తెలంగాణ ఎడారిగా మారకూడదనే తాము పోరాడామని చెప్పారు. ఆ సందర్భంగా తమను నిర్బంధించారని... వివాదం ముదరడంతో, ఎలాంటి కేసు లేదంటూ బలవంతంగా విమానం ఎక్కించి తమను అక్కడ నుంచి హైదరాబాదుకు పంపించేశారని అన్నారు. తనకెప్పుడూ నోటీసులు రాలేదని చెప్పారు. తెలుగు ప్రజల కోసం తానెప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు సీఎంగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఉత్తర తెలంగాణకు అన్యాయం జరగకూడదనే ప్రతిపక్ష నేతగా తాను పోరాడానని చెప్పారు. 

More Telugu News