ys jagan: వైసీపీ అధినేతను కలిసిన ప్రబోధానంద ఆశ్రమ భక్తులు.. అండగా ఉంటామని జగన్ హామీ!

  • జేసీ వర్గీయులు దాడిచేశారన్న భక్తులు
  • తప్పుడు కథనాలు రాయించారని ఆవేదన
  • తాడిపత్రిలో రౌడీ రాజ్యం నడుస్తోందన్న జగన్

తాడిపత్రిలో ప్రబోధానంద ఆశ్రమ వర్గీయులు, చిన్నపొడమల, పెద్దపొడమల గ్రామస్తుల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రమానికి చెందిన కొందరు భక్తులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ ను కలుసుకున్న భక్తులు.. జేసీ సోదరులు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అనుకూల పత్రికల్లో తమపై తప్పుడు కథనాలు రాయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మాట్లాడుతూ.. ఎక్కడో అనంతపురంలో ఉన్న ఆశ్రమ భక్తులు భయంతో తన దగ్గరకు వచ్చారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతగా క్షీణించాయో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. తాడిపత్రిలో రౌడీ రాజ్యం చెలరేగిపోతోందని విమర్శించారు. అల్లర్లను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రి తన వాళ్లను ప్రోత్సహిస్తూ అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ఓవైపు పశ్చిమ గోదావరిలో టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ రెచ్చిపోతుంటే.. మరోవైపు తాడిపత్రిలో చిన్నాపెద్ద, ఆడామగా తేడా లేకుండా జేసీ వర్గీయులు అందరినీ చావగొట్టారని తెలిపారు. ఈ ఘర్షణలను రెచ్చగొట్టిన నాయకులను జైలులో వేసి నాలుగు తగిలిస్తేనే భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగవని వ్యాఖ్యానించారు.

ఆశ్రమానికి, స్వామివారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. ఈ అన్యాయమైన పాలన ఎక్కువ రోజులు కొనసాగదనీ, ధైర్యంగా ఉండాలని భక్తులకు జగన్ చెప్పారు. తాడిపత్రిలో చెలరేగిన ఈ అల్లర్లలో ఇప్పటివరకూ ఒకరు చనిపోగా, 45 మంది గాయపడ్డారు. పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి.

More Telugu News