Ranga Reddy District: నెల రోజుల వ్యవధిలో ఆ గుడిలో మూడు సార్లు దొంగలు పడ్డారు!

  • నిన్న మధ్యాహ్నం ఆలయంలోకి ప్రవేశించిన దొంగ
  • హుండీ బద్దలు కొట్టడంలో విఫలం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు

అది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, పరిగి రోడ్డులో ఉన్న శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు దొంగతనానికి ప్రయత్నం జరుగగా, మూడుసార్లూ హుండీని దోచుకోవడంలో దొంగలు విఫలమయ్యారు. తాజాగా, ఆదివారం నాడు ఆలయంలోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు, ఆలయ హుండీని పగులగొట్టే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. నిన్న మధ్యాహ్నం ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి, రక్షణగా ఉన్న ఇనుప చువ్వలను తొలగించి, హుండీ తాళాన్ని పగులగొట్టాడు.

అయితే, హుండీ లోపల మరో తాళం ఉండటంతో దాన్ని తొలగించడం అతనికి వీలుకాక, గర్భగుడి తాళాలు పగులగొట్టే ప్రయత్నం చేశాడు. మూసివున్న ఆలయం నుంచి శబ్దాలు వస్తుండటంతో స్థానికులు గమనించి, ఆలయం వద్దకు చేరుకుంటుండటంతో, దీన్ని గమనించిన దొంగ ప్రహరీ గోడను దూకి పారిపోయాడు. ఇదిలా ఉంచితే, ఆలయంలో తొలిసారి దొంగతనం జరిగినప్పుడు రూ. 3 వేల విలువైన వస్తువులు, రెండోసారి రూ. 10 వేల విలువైన వస్తువులు చోరీ అయ్యాయని కమిటీ సభ్యులు వెల్లడించారు. ఈ ఆలయం చాలా చిన్నది కాగా, ఆలయంలో ఏముందని దొంగలు ఇన్నిసార్లు ప్రయత్నిస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు.

  • Loading...

More Telugu News