Sri Lanka: ఆసియాకప్ ఆరంభంలోనే సంచలనం... శ్రీలంకపై బంగ్లాదేశ్ ఘన విజయం!

  • తొలుత బ్యాటింగ్ చేసి 261 పరుగులు చేసిన బంగ్లాదేశ్
  • 124 పరుగులకే కుప్పకూలిన శ్రీలంక
  • 137 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ భారీ విజయం

వికెట్ కీపర్ రహీమ్ అద్భుత శతకంతో ఆసియా కప్ తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు, శ్రీలంకపై ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. స్కోరు బోర్డుపై ఒక్క పరుగు కూడా చేరకుండానే రెండు వికెట్లు పడి, తొలి పది ఓవర్లలో 24 పరుగులకే పరిమితమైన బంగ్లాదేశ్ జట్టును, ముష్ఫికర్ రహీమ్ ఆదుకున్నాడు. చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (150 బంతుల్లో 144) ఆడి జట్టు భారీ స్కోరు చేసేందుకు సహకరించాడు. అతనికి యువ ప్లేయర్ మహ్మద్ మిథున్ (68 బంతుల్లో 63) కలవడంతో 49.3 ఓవర్లలో 261 పరుగులను బంగ్లాదేశ్ సాధించింది.

ఆపై 262 పరుగుల కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లంక తడబడింది. తరంగ 27, కుశాల్ మెండిస్ 0, కుశాల్ పెరీరా 11, ధనుంజయ డిసిల్వా 0, మాధ్యూస్ 16, శనక 7, తిసార పెరీర 6, దిల్రువాన్ 29, లక్మల్ 20, అఫోన్సో 4, మలింగ 3 పరుగులు మాత్రమే చేశారు. 35.2 ఓవర్లలోనే 124 పరుగులకు శ్రీలంక ఆలౌట్ కాగా, బంగ్లాదేశ్ జట్టు 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, నేడు పాకిస్థాన్, హాంకాంగ్ మధ్య పోరు జరగనుంది.

More Telugu News