Telangana: కాంగ్రెస్ లో చేరిన అనంతరం కేసీఆర్ పై భూపతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

  • ద్రోహం చేసిన వారికి మాత్రమే టీఆర్ఎస్ లో పెద్దపీట
  • ధనిక తెలంగాణను రుణ తెలంగాణగా మార్చిన కేసీఆర్
  • న్యూఢిల్లీలో మీడియాతో భూపతిరెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిన వారికి మాత్రమే కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఉద్యమకారులకు అన్యాయం చేస్తూ, తనను తిట్టిన వారినే కేసీఆర్ మంత్రివర్గంలో ఉంచుకున్నారని ఈ ఉదయం రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి విమర్శలు గుప్పించారు.

న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత 14 సంవత్సరాలుగా టీఆర్ఎస్ కు అండగా నిలబడిన తాను, ఇప్పుడు పార్టీని వీడాల్సి వచ్చిందని, తనపై అనర్హత వేటు వేసినా సిద్ధంగానే ఉన్నానని అన్నారు. ఎస్టీలు, మైనారిటీలకు రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ మాట తప్పారని, ప్రత్యేక రాష్ట్రం కోసం 1,200 మంది ప్రాణత్యాగం చేస్తే, 400 మందిని కూడా ఆదుకోలేదని నిప్పులు చెరిగారు.

గత నాలుగున్నరేళ్లుగా అభివృద్ధిలో తెలంగాణ వెనుకబడిపోయిందని, నీళ్లు, నిధులు, నియామకాల్లో అన్యాయమే జరుగుతోందని అన్నారు. రైతు బంధు ఓ విఫల పథకమని, కౌలుదారులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులకు డబ్బిచ్చే బదులు, ఆ నిధులతో గిట్టుబాటు ధర కల్పించివుంటే బాగుండేదని భూపతిరెడ్డి అభిప్రాయపడ్డారు. తన చుట్టూ తెలంగాణ ద్రోహులే ఉన్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ధనిక తెలంగాణను రుణ తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.

More Telugu News