సినిమాల్లోకి రావాలనే ఆలోచనే ఉండేది కాదు: యాక్షన్ కింగ్ అర్జున్

14-09-2018 Fri 11:26
  • పోలీస్ ఆఫీసర్ ని కావాలని ఉండేది 
  • అప్పట్లో నటన రాదు .. తెలుగు భాష రాదు 
  • అదంతా కోడి రామకృష్ణగారి చలవ  
తెలుగు .. తమిళ భాషల్లో యాక్షన్ కింగ్ అర్జున్ కి మంచి క్రేజ్ వుంది. కుటుంబ కథా చిత్రాల ద్వారా .. యాక్షన్ చిత్రాల ద్వారా ఆయన ఈ రెండు భాషల ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఆయన తాజా చిత్రంగా 'కురుక్షేత్రం' రూపొందింది. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన కెరియర్ ను గురించి ప్రస్తావించారు.

"మొదటి నుంచి కూడా నాకు పోలీస్ ఆఫీసర్ కావాలని వుండేది .. కానీ అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడూ వుండేది కాదు. పుష్ చేయడం వలన సినిమాల్లోకి వచ్చాను గానీ .. ఇక్కడ ఏం చేయాలనేది ఏమీ తెలిసేది కాదు. తెలుగులో మొదటి సినిమాగా 'మా పల్లెలో గోపాలుడు' చేశాను. కోడి రామకృష్ణగారు ఎలా చేయమంటే అలా చేశాను .. అంతకు మించి నాకు ఏమీ తెలిసేది కాదు. నటన రాదు .. తెలుగు భాష రాదు .. దాంతో కోడి రామకృష్ణగారు నాతో చాలా కష్టపడ్డారు. ఆయనకి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి" అని అన్నారు.