Andhra Pradesh: చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. 21లోగా హాజరు కావాలన్న ధర్మాబాద్ కోర్టు!

  • బాబ్లీ ప్రాజెక్టు నిరసనల నాటి కేసు 
  • ఎనిమిదేళ్లుగా పెండింగులో కేసు 
  • 21న హాజరు కావాలంటూ ఆదేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మరో 14 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారందరినీ ఈ నెల 21లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు నోటీసులు జారీ కాబోతున్నాయంటూ గురువారం ఉదయం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి సాయంత్రానికి అది నిజం కావడంతో రాజకీయ వర్గాల్లో పెను కలకలం రేగింది.

బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణానికి వ్యతిరేకంగా 2010లో టీడీపీ పోరాడింది. ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉందంటూ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రవేశించి ఆందోళన చేశారు. చంద్రబాబు సహా మొత్తం 40 మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర పోలీసులు వారందరిపైనా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. అప్పటి నుంచి ఆ కేసు పెండింగ్‌లో ఉంది.

8 ఏళ్లుగా కేసు పెండింగ్‌లో ఉండడంపై మహారాష్ట్ర వాసి ధర్మాబాద్ కోర్టుకెక్కాడు. అతని పిటిషన్‌ను విచారించిన కోర్టు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఇన్నేళ్ల తర్వాత కేసును మళ్లీ తవ్వి తీయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కారణమైంది.  

More Telugu News