కొత్త పార్టీ పెడుతున్నాం.. అన్ని పార్టీలు దుకాణం మూసుకోవాల్సిందే: ఆర్.కృష్ణయ్య

13-09-2018 Thu 20:26
  • జనాభాలో 52 శాతం ఉన్నా.. మాకు అన్యాయం జరుగుతోంది
  • జిందాబాద్ లు కొట్టేవారిగా, బానిసలుగా చూస్తున్నారు
  • బీసీల పార్టీ పెట్టాలనే ఒత్తిడి పెరుగుతోంది
బీసీ సంఘాల నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కొత్త పార్టీని స్థాపించే దిశగా యత్నాలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ, బీసీలను జిందాబాద్ లు కొట్టే వ్యక్తులుగానే అన్ని పార్టీలు చూస్తున్నాయని, టికెట్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదని మండిపడ్డారు. పార్టీలన్నీ కులాల పార్టీలుగా మారిపోయాయని, బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ఎంతో మంది ముఖ్యమంత్రులైనా ఒక్క బీసీకి కూడా ఇంతవరకు ఆ పదవి దక్కలేదని అన్నారు. బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అయితేనే బీసీ కులాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో బీసీల పార్టీ పెట్టాలంటూ తనపై అందరూ ఒత్తిడి తీసుకొస్తున్నారని తెలిపారు.

తనకు అన్ని పార్టీల నుంచి పిలుపు వచ్చిందని... కానీ, బీసీలకు అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో బీసీల పార్టీ పెట్టడమే మేలనే నిర్ణయానికి తాను వచ్చానని కృష్ణయ్య చెప్పారు. ఇప్పటికే బీసీల్లో ఉన్న మేధావులు, వివిధ శ్రేణులతో చర్చలు జరిపానని తెలిపారు. పార్టీని స్థాపించడమే మేలనే అభిప్రాయాన్ని అందరూ చెప్పారని అన్నారు. తాము పెట్టబోయే పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని చెప్పారు. బీసీ వాదం రెండు రాష్ట్రాల్లో బలంగా ఉందని తెలిపారు. తెలంగాణలో ఎన్నికలు సమీపించాయి కాబట్టి... ఇక్కడ వెంటనే పార్టీ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పారు.

మొన్న టీఆర్ఎస్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో కేవలం 20 మంది బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ... ఇంత అన్యాయంగా టికెట్లను కేటాయిస్తున్నారని మండిపడ్డారు. అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నేతల్లో కూడా అసంతృప్తి ఉందని... తమను బానిసల్లా చూస్తున్నారనే భావన ఉందని... ఇదే విషయాన్ని తనతో చాలా మంది చెప్పారని అన్నారు. బీసీలంతా ఏకమైతే... ఇప్పుడున్న పార్టీలన్నీ టూలెట్ బోర్డులు పెట్టుకోవాల్సిందేనని చెప్పారు.