Uttam Kumar Reddy: దేశంలో ఇదే అతి పెద్ద యాక్సిడెంట్ కావచ్చు... ఆర్టీసీని టీఆర్ఎస్ బలహీనపరిచింది: ఉత్తమ్ కుమార్

  • దేశంలో ఇదే పెద్ద యాక్సిడెంట్ కావచ్చు
  • మృతుల కుటుంబాలకు ఆర్టీసీలో ఉద్యోగాలు కల్పించాలి
  • ఆర్టీసీని టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపరిచింది

కొండగట్టు ఆర్టీసీ బస్సు ప్రమాదం చాలా బాధాకరమైన ఘటన అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ప్రమాదంలో 60 మంది చనిపోవడమంటే సాధారణ విషయం కాదని... బహుశా దేశంలో ఇదే పెద్ద యాక్సిడెంట్ అయి ఉండవచ్చని చెప్పారు. మరో 40 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అన్నారు.

కొండగట్టు ప్రమాదస్థలిని ఈరోజు ఆయన పరిశీలించారు. ఆయనతో పాటు జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితర నేతలు కూడా ప్రమాదస్థలికి వచ్చారు. ఆ తర్వాత మృతుల కుటుంబాలను వారు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీని టీఆర్ఎస్ ప్రభుత్వం బలహీనపరిచిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ  తరపున మృతుల కుటుంబాలకు రూ. 25 వేల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని ఉత్తమ్ తెలిపారు. మూడు నెలల్లో మృతుల కుటుంబాలకు ఆర్టీసీలో ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రమాద ఘటన తెలిసిన వెంటనే తమ అధినేత రాహుల్ గాంధీ స్పందించారని... మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలిపారని చెప్పారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలని తమను ఆదేశించారని తెలిపారు. 

More Telugu News