Lord Ganesh: నేడు వినాయక చవితి.. కోలాహలంగా వీధులు.. కిక్కిరిసిన మార్కెట్లు!

  • ఇలలో తొలి పూజలందుకునే గణనాథుడు 
  • సర్వాంగ సుందరంగా మండపాలు
  • జనాలతో కిక్కిరిసిన మార్కెట్లు

నేడు భాద్రపద శుద్ధ చవితి.. ఇలలో తొలి పూజలందుకునే గణనాథుడిని భక్తి శ్రద్ధలతో కొలిచే రోజు. అందుకే, పిల్లా పెద్దా అంతా ఆయనకు అత్యంత ఇష్టమైన పత్రులు, పండ్లు సేకరిస్తూ బిజీగా మారిపోయారు. మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో 9 రోజులూ దేదీప్యమానంగా వెలిగేలా ఏర్పాట్లు చేశారు. శుభ ఘడియ సమీపించగానే విఘ్ననాథుడిని మండపంలో ప్రతిష్ఠించి పూజలు చేసేందుకు దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మార్కెట్లు, వీధులు కిక్కిరిసిపోయాయి. పార్వతీ తనయుడంటే ఎంతగానో ఇష్టపడే చిన్నారులు గల్లీకి ఒకటి రెండు చిన్నచిన్న మండపాలు వేసి ఏకదంతుడి పూజకు సిద్ధమవుతున్నారు. తమకు తోచిన రీతిలో గణనాథుడిని పూజించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు, విగ్రహాలు, పండ్లు, పత్రుల కొనుగోలుతో మార్కెట్లు కిక్కిరిసిపోయాయి. వచ్చేవారు, వెళ్లేవారితో రద్దీగా మారిపోయాయి. ఎక్కడ చూసినా భక్తి వెల్లివిరుస్తోంది. ఏకదంతుడి నామస్మరణతో పల్లెల నుంచి నగరాల వరకు మార్మోగనున్నాయి.

More Telugu News