RTC Bus: కొండగట్టు బస్సు ప్రమాదంలో కొత్త కోణం.. బ్రేకులు ఫెయిల్... వివరించిన బాధిత బాలిక!

  • బ్రేకులు ఫెయిలయ్యాయంటూ డ్రైవర్ కేకలు
  • దూకేసే వాళ్లు దూకేయాలన్న డ్రైవర్
  • వివరించిన బాధిత బాలిక అర్చన

కొండగట్టు బస్సు ప్రమాదంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన బాలిక ప్రమాదం గురించి వివరించింది. కొడిమ్యాల మండలం తిర్మలాపూర్‌కు చెందిన బాలిక సోమిడి అర్చన (13) తల్లి పుష్పతో కలిసి జగిత్యాల వెళ్లేందుకు బస్సెక్కింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన తల్లి పుష్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన అర్చన కోలుకుంటోంది.

బస్సు ప్రమాదానికి బ్రేకులు ఫెయిలవడమే కారణమని బాలిక పేర్కొంది. బ్రేకులు ఫెయిలయ్యాయని, దూకేవారు దూకేయాలని డ్రైవర్ గట్టిగా అరిచాడని అర్చన పేర్కొంది. డ్రైవర్ మాటలతో ఓ వ్యక్తి బస్సు నుంచి దూకేశాడని తెలిపింది. డ్రైవర్ మాటలతో అందరూ పెద్దగా కేకలు వేశారని, ఒకరిపై ఒకరు పడిపోయారని పేర్కొంది. బస్సు ప్రమాదానికి ముందు తన తల్లికి, కండక్టర్‌కు మధ్య గొడవైందని, బస్సు ఆపితే దిగిపోతామని చెప్పినా వినిపించుకోలేదని వివరించింది. ఒకవేళ బస్సు ఆపి ఉంటే తన తల్లి తనకు దక్కి ఉండేదని బోరున విలపిస్తూ చెప్పింది. కాగా, కొండగట్టులో జరిగిన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 60కి చేరింది.

More Telugu News