Madhya Pradesh: పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నేత హల్ చల్.. గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు!

  • మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఘటన
  • బీజేవైఎం నేత రాహుల్ పుట్టిన రోజు వేడుకలు
  • పోలీసులకు అందిన ఫిర్యాదు

తన పుట్టినరోజు సందర్భంగా బీజేపీ అనుబంధ సంస్థ బీజేవైఎం నేత ఒకరు హల్ చల్ చేశారు. అభిమానుల కోరిక మేరకు గాల్లో తుపాకీతో కాల్పులు జరుపుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది. సదరు నేత నిర్వాకంపై ఓ వ్యక్తి వీడియో సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మధ్యప్రదేశ్ బీజేవైఎం జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు రాహుల్ రాజ్ పుత్ భోపాల్ లోని బైరాగఢ్ లో తన పుట్టిన రోజు సందర్భంగా వేడుకలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు గాల్లో కాల్పులు జరుపుతూ ఎంజాయ్ చేశారు. ఆయనకు బీజేవైఎం జిల్లా చీఫ్ నితిన్ దూబే తోడయ్యారు. ఆయన కూడా ఈ గన్ తీసుకుని గాల్లోకి కాల్చారు.

కాగా, ఈ ఘటనపై ఓ వ్యక్తి వీడియో ఫుటేజీ తో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై రాహుల్ స్పందిస్తూ.. తాను లైసెన్స్ ఉన్న ఎయిర్ గన్ తోనే కాల్చాననీ, తన రివాల్వర్ ను వాడలేదని స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తల కోరిక మేరకే ఈ కాల్పులు జరిపానని వివరణ ఇచ్చారు. 

More Telugu News