Uttar Pradesh: మైనర్ బాలిక శీలానికి వెల కట్టిన పంచాయితీ పెద్దలు.. ఒప్పుకోనందుకు గ్రామం నుంచి వెలి!

  • ఉత్తరప్రదేశ్ లోని ఆలీగఢ్ లో ఘటన
  • రేపిస్టులకు మద్దతుగా గ్రామపెద్దల తీర్పు
  • పోలీసులను ఆశ్రయించిన సోదరుడు

ఓ అమ్మాయిని రేప్ చేసిన దుండగులను పోలీసులకు అప్పగించాల్సిన గ్రామ పెద్దలు ఆ వ్యక్తులకే అండగా నిలిచారు. ఈ ఘటనపై పంచాయితీ పెట్టి బాలికకు రూ.80 వేలు ఇస్తే సరిపోతుందని తేల్చిచెప్పారు. దీంతో బాధితురాలి సోదరుడు పోలీసులను అశ్రయించడంతో నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో ఆలీగఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని ఓ గ్రామంలో బాధితురాలు(14) తన అన్నతో కలసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నేసిన చేతన్ (24), లఖన్ (30), లలిత్ కుమార్ (22), వికాస్ (24)లు.. ఆదివారం ఆమె ఇంటి నుంచి బయటకు రాగానే నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలి పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపెద్దలు నలుగురిని చావబాది పోలీసులకు అప్పగించకుండా పంచాయితీ పెట్టారు. నలుగురు యువకులు చేసింది తప్పేననీ, ఇందుకోసం తలా రూ.20 వేలు చొప్పున బాధితురాలికి రూ.80 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

ఈ ఘటనతో మనస్తాపం చెందిన ఆమె అన్న పోలీసులను ఆశ్రయించాడు. దీంతో నలుగురు నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరిలో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరొకరు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. కాగా, తమ తీర్పునే కాదని పోలీసుల దగ్గరకు వెళ్లడంతో గ్రామపెద్దలు బాధితురాలితో పాటు ఆమె అన్నను ఊరి నుంచి వెలివేశారు. ఈ ఘటనపై అధికారులు ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

More Telugu News