Kutumba Rao: అవినీతి ఆరోపణలను నిరూపిస్తారా.. కోర్టుకెళ్లమంటారా?: జీవీఎల్‌కు కుటుంబరావు హెచ్చరిక

  • కేటాయించిందే రూ.602 కోట్లు
  • రూ.6,700 కోట్ల అవినీతి ఎలా సాధ్యం
  • ఆరోపణలకు కూడా అర్థం ఉండాలి
  • జీవీఎల్‌పై విరుచుకుపడిన కుటుంబరావు

మత్స్య శాఖ పీడీ అకౌంట్ల ద్వారా రూ.6,700 కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలపై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు తీవ్రంగా స్పందించారు. చేసిన అవినీతి ఆరోపణలపై వారం రోజుల్లోగా ఆధారాలు చూపించాలని, లేదంటే నోటీసులు అందుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. గత నాలుగున్నరేళ్లలో బడ్జెట్‌లో మత్స్యశాఖకు మొత్తం రూ.602 కోట్ల నిధులు కేటాయిస్తే, అందులో రూ.572 కోట్లను ఖర్చు చేసినట్టు చెప్పారు. అసలు కేటాయించిందే రూ.602 కోట్లు అయితే, రూ.6,700 కోట్ల గోల్‌మాల్ ఎలా జరిగిందో చెప్పాలని నిలదీశారు.

చేసిన ఆరోపణలపై జీవీఎల్ ఆధారాలు చూపిస్తే డబ్బులు తిరిగి వసూలు చేసి ఆయనకు 10 శాతం నిధులు చెల్లిస్తామన్నారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటుగా మారిందని కుటుంబరావు విమర్శించారు. అలాగే, అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందంటున్న ఆయన అది నిరూపిస్తే 24 గంటల్లో తన పదవికి రాజీనామా చేస్తానన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అనుమానాలను నివృత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా కుటుంబరావు పేర్కొన్నారు. ‘రాజా ఆఫ్ కరెప్షన్’ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాజశేఖరరెడ్డి సత్యహరిశ్చంద్రుడు కాదన్న ఉండవల్లి మాటలు అక్షర సత్యాలని కుటుంబరావు పేర్కొన్నారు.

More Telugu News